మావోయిస్టు పేరిట బెదిరింపు లేఖలు
పోలీసులకు పీసీసీ ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గాప్రసాద్ ఫిర్యాదు
చర్ల, మార్చి 7 (విజయక్రాంతి): తనను చంపుతామంటూ మావోయిస్టుల పేరిట వస్తున్న బెదిరింపు లేఖలపై విచారణ జరిపి, తనకు న్యాయం చేయాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గా ప్రసాద్ మీడియా ఎదుట వాపోయారు. శనివారం చర్ల మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గత 40 సంవత్సరాలుగా నిజాయితీగా సుదీర్ఘ రాజకీయం చేస్తూ, ఎటువంటి అవినీతికి తావు లేకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలతో మమేకమవుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి, గెలుపుకు కృషి చేశానని చెప్పారు.
మావోయిస్టు పార్టీ అగ్రనేత హిడ్మాను తానే నమ్మించి ఆసుపత్రికి తీసుకెళ్తానని చెప్పి పోలీసులకు అప్పగించానంటూ, ఆ తదనంతరం ఎన్ కౌంటర్ జరిగినట్టు తనపై ఆరోపణలు చేస్తూ మావో యిస్టు పార్టీ పేరిట డిసెంబర్ నెలలో లేఖ విడుదల చేశారని చెప్పారు. జనవరి 2న మావోయిస్టు పార్టీ నాయకుడు విప్లవ్ పేరుతో తనను తుద ముట్టిస్తామంటూ మరొక లేఖ విడుదల చేశారని చెప్పారు.
దీనిపై ఎస్పీ రోహిత్ రాజుని కలిసి ఫిర్యాదు చేశానని చెప్పారు. ఆ తర్వాత ఈ నెల 5న మావోయిస్టు పార్టీ కేంద్ర ఏరియా కమిటీ పేరుతో మరొక లేఖ విడుదల చేశారని వెల్లడించారు. ఈ లేఖలు అసలువో, నకిలీవో తేల్చి తగు న్యాయం చేయాలని శనివారం చర్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మావోయిస్టు పార్టీ అగ్రనేత హిడ్మాను ఎప్పుడూ చూడలేదని, అతను ఎవరో కూడా తెలియదని, కావాలనే తన మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.




