calender_icon.png 23 July, 2025 | 11:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చోరీ కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్

23-07-2025 01:03:56 AM

10 తులాల బంగారం, రూ.3.26 లక్షలు స్వాధీనం

చేవెళ్ల/మొయినాబాద్, జులై 22:దొంగతనం కేసులో ముగ్గురు నిందితులకు మొయినాబాద్, రాజేంద్ర నగర్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ పవన్ కుమార్ రెడ్డి వివరాల ప్రకారం.. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని అజీజ్ నగర్ వార్డుకు చెందిన బొర్రా జంగయ్య జులై 16న అమీర్ గూడలోని తన అక్క ఇంటి వద్ద బోనాల పండుగ ఉండడంతో ఇంటికి తాళం వేసి కుంటుంబంతో సహా అక్కడికి వెళ్లాడు.

17న సాయంత్రం తిరిగి ఇంటికి రాగా తాళం విరిగిపోయి ఉండడం గమనించారు. వెంటనే ఇంట్లోకి వెళ్లి చూడగా రెండు బీరువాల తలుపులు తెరిచి ఉన్నాయి. అందులోని ఉంచిన 3 తులాల నల్లపూసల దండ, 2 తులాల ఓం లాకెట్ చైన్, 2 తులాల నక్లెస్, చెవి కమ్మలు, చిన్నపిల్లల బంగారు ఉంగరాలు, వెండి కడియాలు, వెండి పట్టీలతో పాటు రూ.3,70,000 నగదు కనిపించలేదు.

వెంటనే మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మంగళవారం నిందితులు కాళీ మందిర్ వద్ద ఉన్నట్లు సమాచారం అందడంతో రాజేంద్రనగర్ సీసీఎస్ పోలీసుల సహకారంతో అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా నిందితులు మియాపూర్ పరిధి హఫీజ్ పేటలోని సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీకి చెందిన షేక్ అబ్బు తలీబ్ అలియాస్ ఫైజన్ (ఎలక్ట్రీషియన్), ఆధిత్య నగర్ కు అబ్దుల్ రియాజ్ అలియాస్ డాన్ (క్లాత్ షాప్లో వర్కర్) మెహిదిపట్నం పరిధిలోని రేతిబౌలికి చెందిన షేక్ ఉస్మాన్ అలియాస్ సైఫ్ (ఫర్ ప్యూమ్ బిజినెస్)గా గుర్తించారు.

నిందితులు సంగారెడ్డిలో ఆటో దొంగిలించి, రాయదుర్గం పరిధిలోని మణికొండలో తాళం వేసిన ఇంటిలో దొంగతనం చేసి, అజీజ్ నగర్లో బొర్రా జంగయ్య ఇంటిలో చోరీ చేసినట్లు అంగీకరించారు. నిందితుల నుంచి బంగారు ఆభరణాలు.. 3 తులాల నల్లపూసల దండ, 2 తులాల ఓం లాకెట్ చైన్, 2 తులాల నెక్లెస్, అర తులం వంకి, తులం చెవి కమ్మలు, 4 ఉంగరాలు, 60 తులాల వెండి కడియాలు, 20 తులాల వెంటి పట్టీలు, రూ.3,26,000 నగదు, రెండు ఫోన్లు, ఒక ఆటో, రెండు పంక్చర్ రాడ్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వారిని కోర్టులో హాజరు పరిచి జడ్జి ఆదేశాల మేరకు రిమాండ్ కు తరలించినట్లుతెలిపారు.