20-05-2024 01:42:29 AM
వికారాబాద్ జిల్లాలో విషాదం
వికారాబాద్, మే 19 (విజయక్రాంతి) : వికారాబాద్ జిల్లాలో పిడుగుపడి మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఆదివారం జిల్లాలోని యాలాల మండలం బెన్నూరు గ్రామానికి చెందిన వెంకటయ్య(62) తన పొలంలో భార్య ఎల్లమ్మతో కలిసి పనులు చేస్తుండగా మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. దీంతో వెంకటయ్య పక్కనే ఉన్న ఓ చెట్టు కిందికి వెళ్లి నిల్చున్నాడు. అకస్మాత్తుగా పిడుగు పడటంతో వెంకటయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య ఎల్లమ్మ కొద్ది దూరంలో ఉండటంతో పిడుగుపాటు నుంచి తప్పించుకుంది.
ఇదే మండలానికి చెందిన జుంటుపల్లి గ్రామంలో పిడుగుపాటుకు మరో ఇద్దరు మృతిచెందారు. గ్రామానికి చెందిన కొనింటి లక్ష్మప్ప(52), మంగలి శ్రీనివాస్(27) పొలంలో వరి కోత పనులు చేస్తుండగా వర్షం రావడంతో చెట్టుకిందికి వెళ్లారు. వీరు నిల్చున్న చెట్టుపైనే పిడుగు పడటంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు పిడుగుపడి మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు అప్పగించారు.