18-12-2025 11:13:56 AM
సుక్మా: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో గురువారం భద్రతా సిబ్బందికి మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు నక్సలైట్లు మరణించారని పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే... గోలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారని నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ ఆపరేషన్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఆ ప్రాంత్రంలో జిల్లా రిజర్వ్ గార్డ్ బృందం గాలింపు చర్యలు చేపడుతున్నప్పుడు ఉదయం భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయని సుక్మా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కిరణ్ చవాన్ పేర్కొన్నారు.
ఒక మహిళతో సహా ముగ్గురు నక్సలైట్ల మృతదేహాలను ఇప్పటివరకు ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం నుండి స్వాధీనం చేసుకున్నామని, ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని ఆయన చెప్పారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్లలో మొత్తం 284 మంది నక్సలైట్లు హతమయ్యారు. వారిలో, సుక్మా, బీజాపూర్, దంతెవాడతో సహా ఏడు జిల్లాలను కలిగి ఉన్న బస్తర్ డివిజన్‌లో 255 మందిని హతమార్చగా, రాయ్‌పూర్ డివిజన్‌లోని గరియాబంద్ జిల్లాలో మరో 27 మందిని కాల్చి చంపారు. దుర్గ్ డివిజన్‌లోని మోహ్లా-మాన్‌పూర్-అంబాగఢ్ చౌకీ జిల్లాలో ఇద్దరు నక్సలైట్లు మరణించారు.