28-12-2025 10:49:30 AM
హైదరాబాద్: సంగారెడ్డి జిల్లాలో ఘోరా రోడ్డు ప్రమాదం జరిగింది. నారాయణఖేడ్ శివారులో నిజాంపేట్-బీదర్ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ఎన్‌హెచ్-161బి జాతీయ రహదారిపై నిజాంపేట మండల కేంద్రం సమీపంలో కల్వర్టు గుంతలో బైక్ అదుపు తప్పి పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మరణించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు ఆవుటి నరసింహులు (27), జిన్న మల్లేష్ (24), జిన్న మహేష్ (23)గా గుర్తించారు. ముగ్గురూ దగ్గరి బంధువులే అని, ఆ ప్రదేశంలో సరైన లైటింగ్, హెచ్చరిక సూచిక బోర్డులు లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.