పిడుగుల వాన... ఎన్నికల వేళ వాన రంది
రాష్ట్రవ్యాప్తంగా గాలిదుమారంతో కూడిన వర్షం
ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాల్లో కూలిన టెంట్లు
కల్లాల్లో తడిసిన ధాన్యపురాశులు
మెదక్ జిల్లాలో పిడుగుపాటుకు తాతామనుమళ్లు మృతి
ఆదిలాబాద్ జిల్లాలో మరొకరు..
ఏజెన్సీ ప్రాంతాలు అంధకారంలోనే..
తెల్లవారితే లోక్‌సభ ఎన్నికల పోలింగ్. ఉన్నట్టుండి వర్షం మొదలు. గాలిదుమారంతో కూలిన టెంట్లు. అంతటా గందరగోళం. ఉరుములు మెరుపుల మధ్యనే ఈవీఎంలు, వీవీ ప్యాట్లు, సామగ్రి పంపిణీ. తడుస్తూ, ఇబ్బందులను ఎదుర్కొంటూ గమ్యస్థానాలకు పయనం. విద్యుత్ తీగలు తెగి, స్తంభాలు నేలవాలి విద్యుత్ సరఫరాకు అంతరాయం. అంధకారంలోనే రాత్రంతా జాగారం. ఎన్నికల విధులకు సన్నద్ధం. ఇవీ ఆదివారం సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల సిబ్బంది పడిన పాట్లు.
సోమవారమూ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ ప్రకటించడంతో ఎన్నికల సిబ్బంది పోలింగ్ ఎలా జరుగుతుందోనని రంది పడుతున్నారు. మరోవైపు అకాల వర్షానికి పలు జిల్లాల్లోని ధాన్యం సేకరణ కేంద్రాల్లో ఆరబెట్టిన వడ్లు తడిశాయి. రైతులు ధాన్యపు రాశుల్లో నిలిచిన వర్షపు నీటిని మళ్లించేందుకు ఇబ్బందిపడ్డారు. గాలిదుమారంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి ఏజెన్సీ ప్రాంతాలు అంధకారంలోనే ఉండిపోయాయి. పిడుగుపాటుకు మెదక్ జిల్లా రామోజీపల్లిలో తాతామనుమళ్లు, ఆదిలాబాద్ జిల్లాలో మరోవ్యక్తి మృత్యువాతపడ్డారు.
విజయక్రాంతి నెట్‌వర్క్
కుమ్రం భీం ఆసిఫాబాద్/ జయశంకర్ భూపాలపల్లి /ఆదిలాబాద్ /జహీరాబాద్ /సంగారెడ్డి /కామారెడ్డి /నారాయణఖేడ్ /మే 12 (విజయక్రాంతి): అకాల వర్షం తెలంగాణ జిల్లాలను అతలాకుతలం చేసింది. ఆసిఫాబాద్ జిల్లాలోని గండి వాగు పొంగింది. కొన్నిచోట్ల వాగులపై చప్టాలు కొట్టుకుపోవడంతో ఆ మార్గంలో వాహనరాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఏజెన్సీవాసులు ఇబ్బందిపడ్డారు. ప్రధానమార్గాల్లో చెట్లు విరిగి నేలకూలాయి.
దీంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. గాలిదుమారానికి ఇండ్ల పైకప్పులు లేచి కిందపడ్డాయి. కామారెడ్డి జిల్లాకేంద్రంలో 45.5 మి.మీ వర్షపాతం నమోదైంది. గాంధారి మండలంలో 32.8 మి.మీ, పాల్వంచలో 25.8 మి.మీ, దోమకొండలో 21.3 మి.మీ, బిక్కనూరులో 18.3 మి.మీ, బీబీపేట్‌లో 14.3 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లావ్యాప్తంగా అనేక కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసింది. వర్షం తెరిపివ్వకపోవడంతో రైతులు నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సేకరణ కేంద్రాల సిబ్బందికి సూచనలు సలహాలు ఇచ్చారు.
భిక్కనూర్ మండలం తిప్పాపూర్, పాల్వంచ మండలం ఫరిధిపేట్, మాచారెడ్డి మండలం లచ్చాపేట్ కేంద్రాలను జిల్లా పౌరసరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు సందర్శించారు. తడిసిన ధాన్యాన్నీ కొనుగోలు చేయాలని సిబ్బందికి సూచించారు. సదాశివనగర్ మండలం ఉత్నూర్‌లో శిథిలావస్థలోని ఇల్లు కూలింది. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పలుచోట్ల ఇండ్ల పైకప్పులు లేచి కిందపడ్డాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. గాలిదుమారానికి మామిడితోటల్లో కాయలు రాలి కిందపడ్డాయి. భద్రాద్రి జిల్లా ఏజెన్సీలో అనేక వాగులు ఉప్పొంగి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
ఎన్నికల సామగ్రి పంపిణీకి అంతరాయం
పార్లమెంట్ నాలుగో విడుత ఎన్నికలు తెలంగాణ వ్యాప్తంగా జరగనున్నాయి. వాటితో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి సైతం ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసింది.ఇదే సమయంలో వాతావరణశాఖ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో రాగల నాలుగు రోజులు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
పలు చోట్ల ఉరుములు,మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అంతే కాకుండా ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను కూడా జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల వర్షం కారణంగా లోక్‌సభ ఎన్నికల సామగ్రి పంపిణీకి స్వల్ప అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల టెంట్లు కూలిపోయాయి. పోలింగ్ సామగ్రి తడిసింది. నారాయణఖేడ్ పట్టణంతో పాటు ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలోని ఈవీఎంలు, వీవీ ప్యాట్ల పంపిణీ కేంద్రాల్లో గాలిదుమారానికి టెంట్లు కూలిపోయాయి.
దీంతో ఎన్నికల అధికారులు సిబ్బందికి సామగ్రి పంపిణీ చేసేందుకు ఇబ్బందిపడ్డారు. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలు పూర్తిగా ఏజెన్సీ ప్రాంతాలు కావడంతో అకాల వర్షం ఎన్నికల సిబ్బందిని ఇబ్బంది పెట్టింది. సిబ్బంది వర్షంలోనే తమకు కేటాయించిన వాహనాల్లో గమ్యస్థానాలకు చేరుకున్నారు. గాలిదుమారంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో రాత్రంతా అంధకారంలోనే ఉండిపోయారు. పోలింగ్ కేంద్రంలో బిక్కుబిక్కుమంటూ గడిపారు.
తెలంగాణకు ఎల్లో అలర్ట్
పార్లమెంట్ నాలుగో విడుత ఎన్నికలు తెలంగాణ వ్యాప్తంగా జరగనున్నాయి.వాటితో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి సైతం ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసింది. ఇదే సమయంలో వాతావరణశాఖ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో రాగల నాలుగు రోజులు పలు జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
సోమవారం ఆదిబాలాబాద్, ఆసిషాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కొత్తగూడెం, నల్ల గొండ, సూర్యాపేట, రంగారడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి ,మహాబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో గంటకు 30 నుంచి కిలో మీటర్ల వేగంతో గాలలు వీస్తూ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొన్నది. మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్,నిజామాబాద్, జగిత్యాల, భూపాల పల్లి, ములుగు. కొత్తగూడెం,ఖమ్మం ,నల్గొండ, సూర్యాపేట, మహాబూబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
బుధ, గురువారాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కుమ్రం భీం జిల్లాలోని లింగపూర్‌లో ఆదివారం 28 మి.మీ వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలోని అర్లిలో 43.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా అత్యల్పంగా నాగర్ కర్నూల్‌లోని పట్వార్‌పల్లిలో 23.4 ఉష్ణోగ్రతలు నమోదయయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా జూబ్లీహిల్స్ సర్కిల్‌లోని షేక్‌పేటలో 39.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, అత్యల్పంగా రాజేంద్రనగర్‌లోని సర్కిల్ 11లో 24.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.




