12 April, 2026 | 9:00 AM

కరీంనగర్‌లో త్రిముఖ పోరు

13-05-2024 01:12 AM

సంచలన తీర్పుకు కరీంనగర్ వేదిక

కరీంనగర్, మే 12 (విజయ క్రాంతి): పార్లమెంట్ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2194 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 17 లక్షల 97 వేల మంది ఓటర్లు ఉన్నారు. మహిళా ఓట్లే గెలుపోటములను నిర్ణయించనున్నారు. 42 వేల మంది దివ్యాంగులు, 14 వేల మంది వయోవృద్దులు ఉన్నారు. వీరి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక వీల్ చైర్, వయో వృద్దులు, దివ్యాంగులను తీసుకెళ్లేందుకు ఒక ఆటోను అందుబాటులో ఉంచారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగులు 10,200 మంది ఉండగా, ఇందులో 8,815 ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈడీసీ కింద నమోదు చేసుకున్న 6800 మంది ఉద్యోగులు నేడు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఈ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ నుంచి 28 మంది అభ్యులు పోటీ చేస్తున్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో త్రిముఖ పోటీ నెలకొంది. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కుమార్, బీఆర్‌ఎస్ నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేందర్‌రావులు పోటీ చేస్తున్నారు. వీరు ముగ్గురు విస్తృత ప్రచారం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌లు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముగ్గురు గెలుపు ధీమాలో ఉన్నారు. పోటీ చేస్తున్న వారిలో నోటాతో కలుపుకొని ఈవీఎంపై 29 గుర్తులు ఉంటాయి. ఈ మేరకు ఒక్కో పోలింగ్ స్టేషన్‌లో రెండు బ్యాలెట్ యూనిట్లను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ అభిషేక్ మొహంతిలు పర్యవేక్షించారు. 

ప్రత్యేక వసతులు.. పకడ్బందీ ఏర్పాట్లు

ఎన్నికల కమిషన్ నిబంధన మేరకు పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక వసతులు కల్పిస్తున్నారు. కూలర్లు, షామియానాలు, త్రాగునీరు, మెడికల్ టీంలను ఏర్పాటు చేశారు. ఓటర్లు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక క్యూలైన్ సదుపాయం కల్పించారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు 12 రకాల ధృవీకరణ పత్రాలలో ఏదైనా ఒక దానితో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గానికి ఐదు మోడల్ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళిని పర్యవేక్షించనున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కరీంనగర పార్లమెంట్ పరిధిలో 5500 బ్యాలెట్ యూనిట్స్, 2743 కంట్రోల్ యూనిట్స్, 3077 వీవీ ప్యాట్స్‌ను వినియోగిస్తున్నారు. 2500 మంది పోలీసు సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. 

ప్రతిసారి భిన్నమైన తీర్పు

కరీంనగర్ పార్లమెంట్ ఓటర్లు విభిన్నమైన తీర్పును ఇస్తుంటారు. ఇప్పటివరకు జరిగిన పలు పార్లమెంట్ ఎన్నికల్లో విభిన్నమైన తీర్పును ఇచ్చారు. ఎందరో రాజకీయ ఉద్దండులు, ఎందరో సీనియర్ నేతలను ఇంటికి పంపించారు. కొత్త నేతలను అందలం ఎక్కించారు. ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్ పార్టీకి అండగా నిలిచారు. 2019లో ఉద్యమ పార్టీకి మింగుడుపడకుండా తీర్పునిచ్చారు. కరీంనగర్ జిల్లా రాజకీయ వైవిధ్యతకు పెట్టింది పేరు. ప్రభుత్వాలపై తిరుగుబాటు, విప్లవ ఉద్యమాలు ఇక్కడ నుంచే ప్రారంభమైనాయి. తెలంగాణ రాష్ట్ర సమితి 2001లో ఆవిర్భవించినప్పుడు తొలి ఎన్నికల్లో కేసీఆర్‌కు అండగా నిలిచింది. ఉద్యమానికి అండగా నిలిచిన కరీంనగర్ నుంచి కేసీఆర్ 2004లో ఎంపీగా పోటీ చేశారు. అప్పటి యూపీఏలో మంత్రిగా పనిచేసిన ఆయన 2006లో తెలంగాణ కోసం రాజీనామా చేసి ఎన్నికల బరిలో దిగారు. ఉప ఎన్నికల్లో కేసీఆర్‌ను ప్రజలు అక్కున చేర్చుకున్నారు. ఐదు సంవత్సరాల కాలంలో రెండు సార్లు ఎన్నిక కావడంతో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమయింది. కేసీఆర్‌ను గెలిపించినా మెజార్టీ పడిపోయింది.

2009లో ఎన్నికల్లో ఇక్కడి పరిస్థితిని గమనించిన కేసీఆర్ మహబూబ్‌నగర్ నుంచి పోటీ చేశారు. కరీంనగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ గౌడ్ పోటీ చేశారు. అప్పటి వరకు హన్మకొండ ఎంపీగా ఉన్న బోయినపల్లి వినోద్ కుమార్ ఇక్కడ పోటీ చేసి పొన్నం ప్రభాకర్ గౌడ్ చేతిలో ఓటమి పాలయ్యారు. 2009లో పొన్నం ప్రభాకర్ గౌడ్ ఎంపీగా గెలిచి ఎంపీల ఫోరానికి అధ్యక్షుడై ఢిల్లీలో మంచి పట్టు సాధించారు. తెలంగాణ కోసం పెప్పర్ స్ప్రేను ఎదుర్కొని ఎదురు నిలిచినా 2014 ఎన్నికల్లో ఆయన్ను ఓటర్లు ఓడించారు. 2014లో తెలంగాణ రావడం ఈ క్రమంలోనే ఎన్నికలు జరగడంతో ఉద్యమ పార్టీని మరోమారు అందలం ఎక్కించి వినోద్ కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించారు. 2019 ఎన్నికలు వచ్చేసరికి ఓటర్లు బీజేపీవైపు మళ్లారు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్‌ను గెలిపించారు.

ఇక్కడ రాజకీయాలే వేరు

మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రభుత్వ పతనానికి ఇక్కడి రాజకీయాలే కారణమయ్యాయి. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీరామారావు సతీమణి లక్ష్మీపార్వతి ఆశీస్సు లతో శ్రీహరిని సహకార బ్యాంకు అభ్యర్థిగా ప్రకటించారు. అయినప్పటికీ, గండ్ర వెంకటేశ్వర్‌రావును మె జార్టీ ఎమ్మెల్యేలు గెలిపించారు. ఈ క్రమంలో ముగ్గురు ఎమ్మెల్యేలు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ తిరుగుబాటు రాష్ట్రంలోని ఎమ్మెల్యేలకు ఎన్‌టీఆర్‌పై వ్యతిరేకతను పెంచా యి. చంద్రబాబును అందలం ఎక్కించేలా చేశాయి.