అడవిని వదిలి.. గ్రామాల వైపు అడుగులు!
కౌటాలలో పెద్ద పులి గండ్రింపులు
శీర్ష నుంచి గోండాయిపేట్ వరకు కదలికలు? పాదముద్రలతో అప్రమత్తమైన అటవీశాఖ
కౌటల ఆగస్టు 21 (విజయక్రాంతి): కౌటాల అడవుల్లో సంచరించే పెద్దపులి ఇప్పుడు జనావాసాల సమీపంలోకి రావడం కౌటాల మండల ప్రజల్లో ఉత్కంఠ రేపుతోం ది. మండలంలోని శీర్ష, కంకాలమ్మ గుట్ట, తాటిపల్లి రోడ్డు, గోండాయిపేట్ పరిసర ప్రాంతాల్లో పులి సంచారం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ.. గోండాయి పేట్ సమీపంలోని వ్యవసాయ పొలాల్లో పులి పాదముద్రలు వెలుగుచూడటం చర్చనీయాంశంగా మారింది.
పాదముద్రలతో వెలుగులోకి..
గోండాయిపేట్ సమీపంలోని పొలాల్లో కనిపించిన పాదముద్రలను అటవీశాఖ అధికారులు పరిశీలించారు. అవి పెద్దపులి పాద ముద్రలేనని అధికారులు నిర్ధారించడంతో పులి కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టారు. పులి ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు.
ఒకే ప్రాంతంలోనా.. మార్గం మార్చుకుంటుందా?
శీర్ష నుంచి కంకాలమ్మ గుట్ట, తాటిపల్లి రోడ్డు, గోండాయిపేట్ వైపు ఉన్న అటవీ ప్రాంతాలు, పొలాలు పులి సంచారానికి అ నుకూలంగా ఉండటంతో.. ఈ ప్రాంతాల్లో పులి కదలికలు ఏ మేరకు ఉన్నాయనే అం శం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
పులి ఒకే ప్రాంతంలో సంచరిస్తుందా?
లేక అటవీ ప్రాంతాల నుంచి గ్రామాల సమీపంలోని పొలాల వైపు రాకపోకలు సాగిస్తుందా? అనే విషయాలను గుర్తించేందుకు అటవీశాఖ అధికారులు పరిశీలనలు చేపడుతున్నారు.
పొలాల్లోకి వెళ్లాలంటే రైతులకు జంకు
పంట పనులు కొనసాగుతున్న సమయంలో పులి పాదముద్రలు కనిపించడం తో రైతుల్లో ఆందోళన మొదలైంది. వ్యవసా య పనుల కోసం ప్రతిరోజూ పొలాలకు వె ళ్లాల్సి ఉండటంతో.. పులి కదలికలపై స్పష్టత వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.ముఖ్యంగా ఉదయం, సాయం త్రం వేళల్లో పొలాల వద్ద అప్రమత్తంగా ఉం డాలని రైతులు నిర్ణయించుకున్నారు. పశువులను కూడా అటవీ ప్రాంతాల వైపు తీసుకె ళ్లేందుకు వెనుకాడుతున్నారు.
నిఘా పెంచిన అధికారులు
పులి సంచారం నిర్ధారణ కావడంతో అటవీశాఖ అధికారులు పరిసర ప్రాంతాలపై నిఘా పెంచుతున్నారు. పాదముద్రలు కనిపించిన ప్రాంతాలను పరిశీలించడంతో పా టు పులి కదలికలకు సంబంధించిన ఆనవాళ్లను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. పులి కనిపిస్తే ప్రజలు దాని దగ్గరకు వెళ్లకుం డా దూరంగా ఉండాలని, వెంటనే అటవీశాఖకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు.
భయం కాదు.. అప్రమత్తత అవసరం
పులి సంచారం నేపథ్యంలో ప్రజలు భ యాందోళనకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు సూచిస్తున్నారు. పులిని వెంబడించడం, గుం పులుగా చేరి చూడటం, ఫొటోలు లేదా వీడియోలు తీసేందుకు ప్రయత్నించడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. పులి కదలికలు ఎటువైపు? అది మళ్లీ అడవిలోకి వెళ్లిందా.. లేక గ్రామాల సమీపంలోనే సంచరిస్తుందా? అనే ప్రశ్నలకు అటవీశాఖ పర్యవేక్షణతో స్పష్టత రానుంది. దీంతో కౌటాల మండలంలోని శీర్ష, కంకాలమ్మ గుట్ట, తాటిపల్లి రోడ్డు, గోండాయిపేట్ పరిసర ప్రాంతాల ప్రజలు ప్రస్తుతం అప్రమత్తంగా ఉన్నారు.






