కాలమే అంత
10-02-2025 12:00 AM
లోన ఆకులు రాలుతుంటే
అనుభవాలు పచ్చనవుతాయి
మిడిసి పడిన భవనం
కాలం గడుస్తుంటే
పెచ్చలూడదీసుకుంటది!
పైపై అందాలు మసక బారుతుంటే
లోలోన అంతర్ దృష్టి విరాజిల్లుతది
గాలిలో ఎగిరే పతంగిని
ఎవరు ఎంత కాలం ఎగుర వేస్తారు
తాడు తెగిందా
ఆట ముగిసి పోతది!
ఇంతకాలం కలిసి ఆడిన వారు
కలిసి భోజనం చేసిన వారు
అంతా కనుమరుగై పోతారు
దీపం కొండెక్కినప్పుడు
దిగులు మేఘాలన్నీ
ఒక్కసారిగా దుఃఖ సముద్రాలైతవి!
పోయే మర్మం ఎవరూ చెప్పరు
అద్దం జారి ముక్కలైనప్పుడు
జ్ఞాపకాలన్నీ చెల్లాచెదరై పోతవి
ఈ గాయం మానదేమో అనుకుంటాం
పది రోజులకు మానుబడతది
ఆ ఇల్లంతా తెప్పరిల్లడానికి
కాలం కొంత కాలానికి
మంత్రమేదో వేస్తది
పెత్తరమాస నాటికి
ఇష్టమైన భోజనం సిద్ధం చేస్తది!!






