14-01-2026 01:12:43 AM
ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క దేవాలయం
మేడారం, జనవరి 13 (విజయక్రాంతి): మేడారం మహా జాతర ప్రారంభానికి బుధవారం గుడి మెలిగే పండుగతో అంకు రార్పణ జరగనుంది. బుధవారం సమ్మక్క సారలమ్మ దేవతల పూజారులు మేడారం, కన్నెపల్లిలో గుడులను శుభ్రం చేస్తారు. అడవి నుంచి పోరక తెచ్చి సంప్రదాయ పద్ధతిలో గుడి మెలిగే పండుగను నిర్వహించి జాతర ప్రారంభానికి ఏర్పాట్లు ప్రారంభిస్తారు.
వన దేవతలకు ధూప దీపాలతో పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పిస్తారు. అలాగే జనవరి 21న మహా జాతర విజయవంతానికి శక్తిని ప్రసాదించేందుకు దేవతలకు పూజారులు మండ మెలిగే పండగ నిర్వహించి పూజిస్తారు. మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరలో ఈ రెండు వేడుకలను మహా జాతర ప్రారంభానికి సంకేతంగా భావిస్తారు.
ఈ వేడుకల్లో వనదేవతల వంశీయులు, పూజారులు కుటుంబ సమేతంగా, ఆదివాసీలు, గ్రామ పెద్దలు, బంధుమిత్రులతో కలిసి పాల్గొనడం విశేషంగా నిలుస్తోంది. గుడి మెలిగే పండగ నిర్వహణ కోసం మేడారంలో సమ్మక్క గుడి, కన్నేపల్లిలో సారలమ్మ గుడికి మరమ్మతులు నిర్వహించి రంగులు వేయించి సుందరంగా ముస్తాబు చేయించారు.
మేడారం మహా జాతర వేడుకల ఘట్టాలు
జనవరి 14: గుడి మెలిగే పండగ
జనవరి 27: మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ నుంచి పగిడిద్దరాజు మేడారం పయనం.
జనవరి 28: కన్నేపల్లి నుంచి సారలమ్మ, కొండాయి నుంచి గోవింద రాజులు, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజులు మేడారం గద్దెలకు చేరుకుంటారు.
జనవరి 29: మేడారం మహా జాత ర మహాఘట్టంలో భాగంగా సమ్మక్క దేవత చిలుకల గుట్ట నుంచి బయలుదేరి గద్దెకు చేరుకుంటారు
జనవరి 30: మేడారం మహా జాతర గడ్డల ప్రాంగణంపై కొలువుదీరిన వనదేవతలకు భక్తులు మొ క్కులు సమర్పించుకుంటారు.
జనవరి 31: వనదేవతలు తిరిగి వనప్రవేశం చేస్తారు
ఫిబ్రవరి 4న: తిరుగువారం పండగతో మహా జాతర వేడుకలను ముగిసినట్టు ప్రకటిస్తారు.