22-05-2025 12:42:01 AM
జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ పాటించాలంటూ ఇటీవల ఎగ్జిబిటర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పలువురు టాలీవుడ్ నిర్మాతలు బుధవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్ చాంబర్‌లో ఏర్పాటుచేసిన ఈ సమావేశానికి దిల్ రాజు, సురేశ్‌బాబు, డీవీవీ దానయ్య, సాహు గారపాటి, బాపినీడు, నాగవంశీ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల డిమాండ్లపై చర్చలు జరిపారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో మరోసారి ఈ నెల 23న సమావేశం కావాలని నిర్ణయించారు. పర్సంటేజీ విధానానికి కొందరు నిర్మాతలు మొగ్గు చూపగా.. మరికొందరు అనాసక్తి కనబర్చారు. అయితే తుది నిర్ణయాన్ని శుక్రవారమే ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. థియేటర్ల బంద్ విషయమై ఇప్పటికే సినీప్రియుల్లో నెలకొన్న ఉత్కంఠకు రేపటితోనైనా తెరపడుతోందో.. లేదో చూడాలి.