22-05-2025 12:40:14 AM
పవన్‌కల్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఏ దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. నిధి అగ ర్వాల్ కథానాయిక కాగా, బాబీ డియోల్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. జూన్ 12న విడుదల కానున్న ఈ సినిమా నుంచి మూడో గీతంగా ‘అసుర హననం’ విడుదలైంది. ఈ పాటను తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేశారు.
ఈ గీతావిష్కరణ కార్యక్రమాన్ని బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. సంగీత దర్శకుడు కీరవాణి మాట్లాడుతూ.. “పవన్‌కల్యాణ్‌ను అందరూ పవర్ స్టార్ అంటారు. నేను మూర్తీభవించిన ధర్మాగ్రహం అంటాను. ఆగ్రహం అందరికీ వస్తుంది.
కానీ సమాజం కోసం వచ్చేది ధర్మాగ్రహం. ఆయనకు మాత్రమే సరిపోయేలా ‘హరిహర వీరమల్లు’ను తీర్చిదిద్దారు. జయాపజయాలతో సంబంధం లేకుండా దూసుకుపోయే కార్చిచ్చు పవన్‌కల్యాణ్. ఆయనతో మొదటిసారి చేస్తున్న సినిమా కాబట్టి ఎంతో శ్రద్ధతో చేశాను” అన్నారు. దర్శకుడు జ్యోతికృష్ణ, నిర్మాత ఏఎం రత్నం, నిధి అగర్వాల్, గీత రచయిత రాంబాబు గోశాల, నటుడు రఘుబాబు సినిమానుద్దేశించి మాట్లాడారు.