విద్యారంగానికి పెద్దపీట..
- త్వరలో ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం
- ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
వనపర్తి , జూలై 3 ( విజయక్రాంతి ) : రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, త్వరలో ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకాన్ని అమలు చేయనున్నట్లు దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం కొత్తకోట మండలం రాయినిపేట ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన కిచెన్ షెడ్ను జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ప్రారంభించారు. అనంతరం అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక వసతుల కల్పనతో ప్రవేశాలకు ఆదరణ పెరుగుతోందన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్ష నిర్వహించే అవకాశాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. విద్యార్థులకు పోషకాహారం అందించడంతో పాటు పాఠశాల స్థాయి నుంచే కృత్రిమ మేధస్సు (ఏఐ) విద్యను ప్రవేశపెట్టే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.
రాయినిపేట పాఠశాల అభివృద్ధి కోసం జిల్లా కలెక్టర్ తన నిధుల నుంచి రూ.23.80 లక్షలు మంజూ రు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే కొనియాడారు. తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం ఉంచి తమ పిల్లలను అక్కడే చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రశాంత్, సర్పంచ్ భాగ్యలక్ష్మి, డీఎస్‌ఓ శ్రీనివాస్, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.






