calender_icon.png 12 September, 2025 | 3:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బుల్లెట్ రైళ్లు

12-09-2025 12:58:05 AM

హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరుకు..

ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్టు వరకు గ్రీన్‌ఫీల్డ్ హైవేకు అనుసంధానంగా రైల్వేలైన్

-ఇండస్ట్రియల్ సెక్టార్ కోసం స్పెషల్ లైన్ 

-ట్రిపుల్ ఆర్ చుట్టూ 362 కి.మీ. రీజినల్ రింగ్ రైలు

-వికారాబాద్ కొత్త రైల్వే లైన్ పనులు త్వరగా చేపట్టాలి 

-భవిష్యత్ అవసరాల కోసంప్రతిపాదనలు సిద్ధం చేయండి 

-పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): కొత్తగా అభివృద్ధి చేస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రతిపాదనలకు అనుగుణంగా హైదరాబాద్ హైదరాబాద్ బుల్లెట్ రైళ్ల ప్రాజెక్టుల సర్వే, అలైన్ మెంట్ ప్రతిపాదనలను మరోసారి పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదే శించారు. భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవేకు అనుసంధానంగా రైల్వే లైన్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.

రాష్ర్టంలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, కొత్తగా ప్రతిపాదనలో ఉన్న ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో దక్షిణ మధ్య రైల్వే అధికారులతో పాటు వివిధ విభాగాల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు, లైన్‌లను వేగవంతంగా పూర్తి చేసేందుకు రాష్ర్ట ప్రభుత్వం నుంచి పూర్తి సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

అవసరమైన నిధులను సమకూర్చడంతో పాటు భూసేకరణకు రాష్ర్ట ప్రభుత్వం సిద్ధంగా ఉందని తేల్చిచెప్పారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టుల అలైన్‌మెంట్లు ఉండాలని, దూరాభారాన్ని తగ్గించి, అంచనా ఖర్చును కూడా తగ్గించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రయాణికులకు వేగవంతమైన రవాణా సదుపాయాలు అందించటంతో పాటు కొత్తగా వేసే రైలు మార్గాలన్నీ ఆయా ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి ఉపయోగపడేలా ఉండాలని సూచించారు. ప్రధానంగా పర్యాటక కేంద్రాలు, పారిశ్రామిక అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలని తెలిపారు.

విదేశాల తరహాలో రైలు, రోడ్డు, పోర్ట్ కనెక్టివిటీని అధునాతనంగా అభివృద్ధి చేయాలన్నారు. ‘భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవేతో పాటు అనుసంధానంగా రైల్వే లైన్ ఏర్పాటు చేయాలి. రాష్ర్ట పునర్విభజన చట్టంలోని హామీ ప్రకారం హైదరాబాద్ నుంచి అమరావతికి ర్యాపిడ్ రైల్ అండ్ రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టును కేంద్రం అమలు చేయాల్సి ఉంది. కొత్తగా ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు వరకు 12 లైన్ల  గ్రీన్ ఫీల్డ్ హైవే ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశాం.

అందుకు సంబంధించి 300 కి.మీ. అలైన్‌మెంట్ ప్రతిపాదనలను కూడా రాష్ర్ట ప్రభుత్వం తయారు చేసింది. దానికి అనుగుణంగా రైల్వే లైన్ ఏర్పాటు చేయాలి. రైల్వే విభాగం పరిశీలనలో ఉన్న అలైన్‌మెంట్‌తో పాటు రాష్ర్ట ప్రభుత్వం సిద్ధం చేసిన అలైన్‌మెంట్‌ను పరిశీలించి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ముందుకెళ్లాలి’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. హైవే వెంట రైలుమార్గం ఉండాలని, హైవేకు ఇరువైపులా కిలోమీటర్ల దూరం వరకు ఇండస్ట్రియల్ కారిడార్‌ను విస్తరించాలనే ప్రతిపాదనలున్నట్టు చెప్పారు.

‘హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రైల్ ఉండాలి. దాదాపు 362 కిలోమీటర్ల మేరకు రీజనల్ రింగ్ రోడ్డు వెంట రింగ్ రైలు ఏర్పాటు చేయటంతో హైదరాబాద్ మహానగరం భవిష్యత్ స్వరూపం మారిపోతుంది. వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి. తెలంగాణ ఇండస్ట్రియల్ సెక్టార్ కోసం ప్రత్యేక రైల్వే లైన్ ఉండేలా ఈ కనెక్టివిటీ ఉండాలి. వికారాబాద్- కొత్త రైల్వే లైన్ పనులను వీలైనంత త్వరగా చేపట్టాలి. గద్వాల నుంచి డోర్నకల్ రైల్వే లైన్ పనుల డీపీఆర్ పూర్తి చేసి వేగంగా చేపట్టాలి’ అని సీఎం సూచించారు.

వరంగల్‌లోనూ రైల్వే లైన్లను అభివృద్ధి చేయాలని, భూపాలపల్లి నుంచి వరంగల్ వరకు కొత్త మార్గాన్ని పరిశీలించాలన్నారు.  కాజీపేట జంక్షన్‌లో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్‌తో పాటు వరంగల్‌ను అభివృద్ధి చేయాలని.. అందుకు అనుగుణంగా రైల్వే ప్రాజెక్టులు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి రైల్వే అధికారులను సూచించారు. సమీక్ష సమావేశంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, స్పెషల్ సెక్రటరీ వికాస్‌రాజ్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.