12-09-2025 12:44:50 AM
-మెదక్‌లో 3 గంటల్లోనే 18.4 సెం.మీ.ల వర్షం
-వరంగల్‌లో దంచికొట్టిన వాన
-జలమయమైన రోడ్లు, నీట మునిగిన కాలనీలు
-భువనగిరి జిల్లాలో 4 గంటలపాటు బీభత్సం ఆలేరులో తెగిన బైరామ్‌కుంట చెరువు
-ఇళ్లలోకి చేరిన నీరు
విజయక్రాంతి నెట్‌వర్క్, సెప్టెంబర్ 11: రాష్ట్రంలోని పలు జిల్లా ల్లో గురువారం భారీ వర్షం కురిసింది. మెదక్ లో మూడు గంటల్లోనే 13 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 4 గంటలపాటు బీభత్సం సృష్టించింది. వరంగల్‌లో కుండపోత పోసింది. దీంతో రోడ్లు జలమయంకాగా, పలు కాలనీలు నీట మునిగాయి.
భువనగిరి జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. ఆలేరులో బైరామ్‌కుంట చెరువు తెగి పట్టణంలోని ఇళ్లలోకి నీరు చేరింది. ఇదే జిల్లాలో పిడుగుపాటుకు గేదె మృతి చెందింది. మెదక్ జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురిసింది. మూడు గంటల్లోనే 18.4 సెంటీ మీటర్ల వర్షం కురవడంతో పలు కాలనీలు, రోడ్లన్నీ జలమయం అయ్యాయి.
గురువారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు భారీ వర్షం కురిసింది. మెదక్ పట్టణంలో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. మెదక్ ప్రధాన రహదారి పూర్తిగా డ్రైనేజీ, వర్షం నీటితో నిండిపోవడంతో వాహనదారులు ఇబ్బందులుపడ్డారు. మెదక్ పట్టణం లోని గాంధీ నగర్ కాలనీ, వెంకట్రావ్‌నగర్, బృందావన్ కాలనీ, ఫతేనగర్ కాలనీలు నీలమునిగాయి.
ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులుపడ్డారు. అలాగే పాతుర్ గ్రామంలో 8 సెం.మీ.ల వర్షం కురిసింది. హవేళీఘణపూర్, కొల్చారం, కౌడిపల్లి, పాపన్నపేట, టేక్మాల్, రామాయంపేట, అల్లాదు ర్గం, పెద్దశంకరంపేట మండలాల్లో సైతం వర్షం కురిసింది. మెదక్ హైవేపై భారీగా వరద నీరు చేరడంతో అధికారులు రాందాస్ చౌరస్తాలో కొంత మేరకు డివైడర్‌ను జేసీబీతో తొలగించి వరద నీటిని మళ్లించారు.
అలాగే మెదక్ పట్టణంలోని బాలికల జూనియర్ కళాశాల వర్షం నీటితో నిండిపోవడంతో విద్యార్థినులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. పట్టణంలోని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ బాలుర హాస్టల్, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో వరద నీటిని కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. హాస్టల్ భవనాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
భువనగిరిలో దంచి కొట్టిన వాన
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో వర్షం బీభత్సం సృష్టించింది. దాదాపు నాలుగు గంటల పాటు ఎడతెరిపి లేకుండా దంచి కొట్టిన వానకు పట్టణం తడిసి ముద్దయింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లి రోడ్ల మీద ప్రవహించాయి. అనంతరంలో వ్యవసాయ బావి వద్ద పిడుగు పడి గేదె మృతి చెందింది.
భువనగిరి పట్టణంలో జీనియస్ స్కూల్ పరిసర ప్రాంతాలలో పిడుగు పడింది. జూనియర్ కళాశాల గ్రౌండ్, బస్టాండ్, ప్రిన్స్ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా దేదేపూర్ చౌరస్తాలు వరద నీటితో నదులను తలపించాయి. చెరువులు, కుంటలను తలపించే విధంగా బస్టాండ్, కళాశాల గ్రౌండ్ నిండిపోయాయి. భువనగిరి పెద్ద చెరువు నిండుకుండలా మారి, అలుగులు దూకుతున్నది.
తీనం చెరువు, అనాజపురం చెరువు, కుంటలు కాలువలు పొంగిపొర్లి వరదనీరు రోడ్లపై ప్రవహిస్తున్నాయి.ఆలేరు పట్టణంలో భారీ వర్షం కురిసింది. బైరామ్‌కుంట తెగిపోవడంతో ఆలేరు పట్టణంలోని ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. పరిస్థితిని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరిశీలించారు. వరద నీటిని మళ్లించేందుకు జేసీబీతో కాలువ తీయించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు ౨,౩ రోజులపాటు ఆహార పదార్థాలు అందజేయాలని కలెక్టర్‌కు సూచించారు.
వరంగల్‌లో..
వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. సుమారు గంటన్నర పాటు ఏక బిగిన కురిసిన వర్షానికి ఆయా ప్రాంతాల్లో రోడ్లన్నీ వాగులుగా మారిపోయాయి. వీధుల్లో నడు ము లోతు నీరు ప్రవహించడంతో జనజీవనం స్తంభించిపోయింది. జనగామలో డ్రైనే జీ వ్యవస్థ అసవ్యస్తంగా మారింది. వరద నీరు పూర్తిగా వీధుల్లోనే నిలిచిపోయింది.
హుజురాబాద్‌లో..
హుజురాబాద్(విజయ క్రాంతి): కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో గురువారం రాత్రి 7:30 గంటల నుండి వర్షం ఎడతెరిపి లేకుండా కురిసింది. దీంతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరింది.
వివిధ ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం
గురువారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నమోదైన వర్షపాత వివరాలు ఈవిధంగా ఉన్నాయి. ములుగు జిల్లా ముల్లంపల్లిలో 17.6 సెం.మీ., కరీంనగర్ జిల్లా బోర్నపల్లిలో 19.2 సెం.మీ., ఇందుర్తిలో 17, మెదక్‌లో 18.4, రాజ్‌పల్లిలో 14.4, రంగారెడ్డి జిల్లా యాచారంలో 18 సెం.మీ., హయత్‌నగర్‌లో 10.5, యాదాద్రి జిల్లా కొలనుపాకలో 17.6, మోటకొండూరులో 16.5, సిద్దిపేట జిల్లా గండిపేటలో 17.1, ధూల్మిట్టలో 15.3, నల్లగొండ జిల్లా గుండ్లపల్లిలో 11.3 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది.