12-09-2025 12:55:12 AM
రాష్ట్రవ్యాప్తంగా వానాకాలంలో 1.30 కోట్ల ఎకరాల్లో పంటలు
-గత ఏడాది 1.28 కోట్ల ఎకరాల్లోనే సాగు
-ఈసారి 6 లక్షల ఎకరాల్లో తగ్గిన వరి విస్తీర్ణం
-స్వల్పంగా పెరిగిన పత్తి సాగు
-గతేడాది 44.75లక్షల ఎకరాలు, ఈసారి 45.7౬లక్షల ఎకరాలు
-ఈ ఏడాది వరి తర్వాత రెండో స్థానంలో పత్తి
-ఆ తర్వాత మొక్కజొన్న, సోయాబిన్ పంటలు
-తగ్గుతున్న తృణధాన్యాల సాగు
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): రాష్ట్రంలో వర్షాలు సకాలంలో కురువడం, ప్రాజెక్టులు, చెరువులు, రిజర్వాయర్లు, కుంటలు నిండటంతో ఏటా పంటల సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోం ది. ఈ ఏడాది కూడా వానాకాలం పంట ల సాగు విస్తీర్ణం గతేడాదితో పోలిస్తే 2% పెరిగింది. గత ఏడాదిలో 1,28,67,494 ఎకరాల్లో వివిధ పంటల సాగు అయితే.. ఈ ఏడాది 1,30,94,934 ఎకరాల సాగు విస్తీర్ణం నమోదైంది.
గతేడాదిలో వరి, జొన్నలు, సజ్జలు, రాగులు, కందులు, పెసర్లు, సోయాబిన్, వేరుశనగ పంటల విస్తీర్ణం అధికంగా ఉండగా.. ఈ ఏడాది మాత్రం తగ్గింది. మొక్కజొన్న, పత్తి, పొగాకు, చెరకు తదితర పంటల విస్తీర్ణం పెరిగింది. అయితే రైతులు ప్రధానంగా వరి, పత్తి పంటల సాగుపైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. ఆ తర్వాత మొక్క జొన్న, సోయాబిన్ సాగు చేస్తున్నారు. కాగా ఈ ఏడాదిలో 62,47,868 ఎకరాల్లో వరి సాగు అవుతుందని ప్రభుత్వం అంచనా వేయగా, 65,52,000 ఎకరాల్లో వరిసాగు (104.87 శాతం) నమోదైంది.
రాష్ట్ర ప్రభుత్వం వరి పంటకు మద్దతు ధర కల్పించడంతో పా టు అదనంగా క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లిస్తుండటంతో రైతులు ఎక్కువగా వరి సాగుపై ఫోకస్ పెట్టారు. ఇక పత్తి పంట విషయంలో ప్రభుత్వం 48, 93,016 ఎకరాల్లో సాగు చేస్తారని వ్యవసా య శాఖ అంచనా వేసింది. కానీ రైతులు 45,76,992 ఎకరాల్లోనే (93.54 శాతం) సాగు చేశారు. గతేడాది 44,75,252 ఎకరాల్లోనే పత్తి సాగు చేశారు. గత ఏడాది కంటే ఇప్పుడు అదనంగా లక్ష 2 వేల ఎకరాల్లో పత్తి విస్తీర్ణం పెరిగింది. ఇక మొక్కజొన్న 5,21,206 ఎకరాల విస్తీర్ణం ఉం టుందని ప్రభుత్వం అంచనా వేసింది.
కానీ, రైతులు మాత్రం అదనంగా 6,36,705 ఎకరాలు (122.16 శాతం) సాగు చేశారు. సోయాబిన్ పంట విషయంలో ప్రభుత్వం వేసిన అంచనా కంటే తక్కువ విస్తీర్ణం నమోదైంది. 4,20,625 ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేయగా.. 3,62,101 ఎకరాల్లో (86.09 శాతం) విస్తీర్ణం నమోదైంది.
ఇక చిరు ధాన్యాలు, మిల్లెట్స్, ఇతర వాణిజ్య పంటల సాగు విస్తీర్ణం మాత్రం వ్యవసాయ శాఖ అంచనా వేసినదానికంటే తగ్గింది. పప్పు ధాన్యాలు (కంది, పెసర్లు, మినుములు, ఉలువులు, బొబ్బర్లు, అనుములు) 7,92,517 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేయగా.. 5,78,207 ఎకరాల్లో (72.96 శాతం) మాత్రమే రైతులు సాగు చేశారు. వరి, మొక్క జొన్న, జొన్నలు, పప్పు ధాన్యాల సాగు మొత్తంగా 76,14,901 ఎకరాల అంచనాకు గాను 78,03,479 ఎకరాల్లో (102.48 ) సాగు విస్తీర్ణం జరిగింది.