calender_icon.png 12 September, 2025 | 2:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా కష్టాలు తీరేనా?

12-09-2025 12:37:21 AM

వర్షం కురుస్తున్నా క్యూలోనే రైతులు

ఒక్కబస్తా కోసం రెండు రోజుల సమయం

టోకెన్ల కోసం ఒకరోజు, యూరియా బస్తా కోసం మరొక రోజు 

తెల్లవారకముందే వరసలో చెప్పులు 

తాండూరు/సిద్దిపేట రూరల్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి)/: రాష్ట్రంలో రైతులకు యూరియా కష్టాలు ఇంకా తప్పడం లేదు. పంటలు కాపాడుకునేందుకు యూరియా బస్తాల కోసం తండ్లాడుతున్నారు. వర్షం కురుస్తున్నా క్యూలో నిల్చుంటున్నారు. ఒక్కబస్తా కోసం రెండు రోజుల సమయం కేటా యించాల్సి వస్తోంది.

టోకెన్ల కోసం ఒకరోజు, యూరియా బస్తా కోసం మరొక రో జు క్యూలో ఉంటున్నారు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల కేంద్రంలో ఉన్న రైతు సేవా సహకార సంఘం వద్ద గురువారం టోకెన్ల కోసం క్యూ కట్టారు. భారీగా వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా వర్షంలోనే తడుస్తూ బారులు తీరారు. సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలం చిన్న గుండవెల్లి గ్రామంలో గురువారం తెల్లవారక ముందే యూరియా విక్రయ కేంద్రం ముందు రైతులు చెప్పులను వరుసలో పెట్టారు. 

యూరియా కోసం రోడ్డెక్కిన అన్నదాతలు

కామారెడ్డి(విజయక్రాంతి)/సదాశివానగర్/జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో యూరియా కోసం రైతులు గురువారం నిరసన తెలిపారు. జిల్లా కేం ద్రంలో ఉదయం నుంచి యూరియా కోసం క్యూ లో నిలుచున్న రైతులకు సరిపడా యూరియా లేదని అధికారులు చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిరిసిల్ల- రోడ్డుపై గంజి గేటుకు ఎదురుగా బైఠాయించారు.

అధికారుల తీరుపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. కాగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో 200 బ్యాగుల యూరియా ఉం డగా అంతకు రెట్టింపు మంది రైతులు యూ రియా కోసం వచ్చి క్యూలో నిల్చున్నారు. దీంతో ఇక్కడున్న యూరియా ఎవరికి సరిపోదని గ్రహించిన అధికారులు మళ్లీ రేపు కూడా యూరియా లోడ్ వస్తుందని, ఇప్పుడున్న యూరియాతో పాటు రేపు వచ్చే యూరియాకు కూడా కలిపి టోకెన్లు ఇస్తామని రైతులను సర్ది చెప్పి టోకెన్లు ఇచ్చి పంపించి వేశారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని పద్మాజీవాడి గ్రామ సింగిల్ విండోలో యూరియా కోసం గురువారం రైతులు ఉదయం నుండి రాత్రి వరకు క్యూలో వేచి ఉన్నారు.

సూర్యాపేట జిల్లాలోని జాజిరెడ్డిగూడెం మండలంలో యూరి యా కోసం అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు. జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపు రం పీఏసీఎస్‌కు 277యూరియ బస్తాలు రాగా దాదాపు 600 మంది రైతులు క్యూలో నిలబడ్డారు. దీంతో కొందరు రైతులకు యూరియా అందక నిరాశతో వెనుదిరిగా రు. మండల కేంద్రం అర్వపల్లిలోని పీఏసీ ఎస్ కేంద్రంలో యూరియా లేకపోవడంతో ఆగ్రహించిన రైతులు, సీపీఎం నాయకులు సూర్యాపేట జాతీయ రహదారిపై 3 గంటల పాటు రాస్తారోకో చేశారు. దీంతో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. 

మహబూబాబాద్ జిల్లాలో నూతన విధానం

మహబూబాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు అధికారుల చొరవతో యూరియా పంపిణీ వ్యవహారం కాస్త గాడిలో పడ్డప్పటికీ, సులువుగా యూరియా లభించని పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉంది. రైతు వేదికల్లో ఆధార్ కార్డు, పట్టా పాస్ పుస్తకం జిరాక్స్ పత్రాలను తీసుకువచ్చి అధికారులకు చూ పించి, ఆన్‌లైన్‌లో రైతు భరోసా డేటా ప్రకా రం సీరియల్ నెంబర్ ఆధారంగా యూరి యా పంపిణీ చేసే క్లస్టర్, విక్రయ కేంద్రం వివరాలు అధికారులు తెలుపుతున్నారు.

రైతులు కూపన్లు తీసుకుని తమ సీరియల్ వచ్చేసరికి వేచి ఉంటూ, తర్వాత అక్కడికి వెళ్లి యూరియా తెచ్చుకోవాల్సి వస్తోంది. జిల్లావ్యాప్తంగా పూర్తిగా ఇదే విధానాన్ని అమలు చేస్తున్నారు. గొడవలు, రద్దీ , తోపులాటలు, తొక్కిసలాట సంఘటనలు పూర్తిగా తొలగిపోయినప్పటికీ,  అడిగిన వెంటనే ఈ సీజన్ ముగింపు వరకు కూడా యూరియా లభించని పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.

మీకు దిక్కున్న చోట చెప్పుకోండి రైతులపై చేర్యాల ఏడీఏ రాధిక మండిపాటు

చేర్యాల: సిద్దిపేట జిల్లా చేర్యాలలో రెండు రోజుల క్రితం యూరియా పక్కదారి పడుతుందని రైతులు ధర్నా చేయగా.. అలా జరగకుండా చూసుకుంటానని ఏడీఏ రాధిక హామీ ఇచ్చారు. అయినా కూడా యూరియా పక్కదారి పడుతున్నదంటూ గురువారం చేర్యాల జాతీయ రహదారిపై రైతులు బైఠాయించారు.

యూరియా బస్తాలు కావాలని ఏడిఏ రాధికను కోరితే.. వినకుండా తమపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తూ దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ బెదిరింపులకు దిగుతున్నదని ఆరోపించారు. యూరియా పక్కదారి పట్టించిన ఏఓ భోగేశ్వర్‌పై చర్యలు తీసుకోకుండా ఆయనకు సహకరిస్తున్న ఏడీఏ రాధికపై ఉన్నతధికారులు చర్యలు తీసుకుని, తమకు సకాలంలో యూరియా బస్తాలు అందేవిధంగా చూడాలని కోరారు. ఆందోళనకు దిగిన రైతులతో చేర్యాల తహసీల్దార్ దిలీప్‌నాయక్, సీఐ శ్రీను మాట్లాడి ఆందోళన విరమింపజేశారు.