14 August, 2026 | 9:49 PM

మండల ప్రజావాణిని సమర్థవంతంగా నిర్వహించాలి

14-08-2026 08:43 PM

ఈ నెల 17వ తేదీ సోమవారం నుంచి మండల స్థాయిలో ప్రజావాణి 

ప్రజల సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపాలి

జిల్లా కలెక్టర్ అంకిత్

భద్రాద్రి కొత్తగూడెం,(విజయ క్రాంతి): ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు.  కలెక్టర్  ఆదేశాల మేరకు జిల్లా ఈ డిస్టిక్ మేనేజర్ సైదేశ్వరరావు, జిల్లా ప్రజావాణి సూపరింటెండెంట్ రంగు రమేష్‌తో కలిసి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి ఆపరేటర్లకు ప్రజావాణి నిర్వహణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈ డిస్టిక్ మేనేజర్ సైదేశ్వరరావు మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీ సోమవారం నుంచి అన్ని మండల కేంద్రాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో మండల ప్రజావాణి నిర్వహించనున్నట్లు తెలిపారు. మండల కేంద్రాల్లోనే ప్రజల నుంచి వినతులు స్వీకరించి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం ద్వారా ప్రజలకు సమయం, ప్రయాణ ఖర్చు ఆదా అవుతుందన్నారు. ప్రతి ఫిర్యాదును బాధ్యతగా స్వీకరించి, సంబంధిత శాఖలకు వెంటనే పంపించాలని, పరిష్కార పురోగతిని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు.

జిల్లా ప్రజావాణి సూపరింటెండెంట్ రంగు రమేష్ మాట్లాడుతూ మండల ప్రజావాణికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి వినతిని సక్రమంగా నమోదు చేసి, సంబంధిత అధికారులకు వెంటనే చేరవేయాలని తెలిపారు. ఫిర్యాదుల పరిష్కారంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు వేగవంతమైన సేవలు అందేలా సిబ్బంది బాధ్యతగా పనిచేయాలని సూచించారు. అనంతరం మండల స్థాయి ఆపరేటర్లకు ఫిర్యాదుల నమోదు, సంబంధిత శాఖలకు పంపడం, పరిష్కార ప్రక్రియ, ఆన్‌లైన్‌లో పురోగతి నమోదు తదితర అంశాలపై శిక్షణ అందించారు.