బస్సుయాత్రతో కాంగ్రెస్, బీజేపీల్లో వణుకు
ఆ పార్టీలకు ఓటమి భయం పట్టుకుంది
బీఆర్‌ఎస్ నేత రావుల శ్రీధర్‌రెడ్డి
హైదరాబాద్, మే 8 (విజయక్రాంతి): కేసీఆర్ బస్సుయాత్రతో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారాయని బీఆర్‌ఎస్ రాష్ట్ర నేత రావుల శ్రీధర్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల్లో ఓటమి భయం పట్టుకుందని చెప్పారు. తెలంగాణ భవన్‌లో బుధవారం మాట్లాడుతూ.. సర్వే నివేదికలు చూస్తే సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి దిమ్మతిరగడం ఖాయమని పేర్కొన్నారు. వాగ్దానాల వరద, నోటి దురద, అబద్ధాల బురద తప్ప రేవంత్‌రెడ్డి దగ్గర ఏమి లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ భయంతోనే రైతు బంధును నిధులు విడుదల చేశారని అన్నారు. రైతుబంధు విషయంలో బీఆర్‌ఎస్ ఎక్కడ ఫిర్యాదు చేయలేదని, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ ఆపిందన్నారు. రైతుల సంక్షేమం కోసం తమ పార్టీ పనిచేస్తుందని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో రైతులు బీఆర్‌ఎస్ వైపు ఉంటారని జోస్యం చెప్పారు. కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ సభలకు జనం రావడంలేదని ఎద్దేవా చేశారు.




