ఇండియా కూటమిదే విజయం

09-05-2024 01:30:57 AM

మోదీ గ్లామర్ తగ్గింది 

పీవీని ప్రధాని, సీఎం చేసింది కాంగ్రెస్ పార్టీనే 

రాహుల్‌గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబం 

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

హైదరాబాద్, మే 8 (విజయక్రాంతి):  పార్లమెంట్ ఎన్నికలు రాహుల్‌గాంధీ, మోడీ మధ్యనే జరుగుతున్నాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. గాఢి తప్పిన ఆర్థిక వ్యవస్థ బాగుపడాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలన్నారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మోదీ నియంత పాలనను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, రాహుల్ గాంధీ, సోనియా నాయకత్వంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందన్నారు. రాహుల్ గాంధీ ప్రజల నాయకుడైతే.. మోదీ గ్లామర్ నాయకుడన్నారు. ఎన్నికల ప్రచారంలో మతపరమైన వ్యాఖ్యలు చేసి ప్రజలను ఆకట్టుకోవాలని మోదీ చూస్తున్నాడని జగ్గారెడ్డి విమర్శించారు.

ఇప్పుడు మోదీ గ్లామర్ తగ్గిందని, ఇండియా కూటమే అధికారంలోకి వస్తుందన్నారు. కాంగ్రెస్ హయంలో తులం బంగారం రూ. 28 వేలు ఉంటే ఇప్పు డు రూ. 76 వేలకు చేరిందని ఆయన విమర్శించారు. బంగారం ధర తగ్గాలంటే రాహుల్‌గాంధీ ప్రధాని కావాలన్నారు. శ్రీరాముడి పాలనకు మోదీ పాలనకు పొంతన లేదన్నారు. కానీ, మతం పేరుతో హిందూ, ముస్లింల మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. శ్రీరాముడి పూజా సామాగ్రి మీద కూడా బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ వేస్తోందన్నారు.

గాంధీ కుటుంబం త్యాగాల కింద అమిత్‌షా చరిత్ర జీరో అన్నారు. పీవీని ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, అందుకే భారతరత్న వచ్చిందనే విషయం ఆయన కుటుంబ సభ్యులు మర్చిపోవద్దన్నారు. ఈ విషయంపై బీజేపీ చర్చకు సిద్ధమా? అని సవాలు విసిరారు. బ్రాహ్మణ సమాజం, పీవీ కుటుంబం ఆలోచించాలన్నారు. పీవీ ఇంటికి మోదీ వెళ్లడానికి కారణం కాంగెస్ పార్టీనేనని, పీవీ ప్రధాని కాకపోయి ఉంటే వారి ఇంటికి మోదీ వెళ్లేవాడా? అని ఆయన ప్రశ్నించారు.