11 March, 2026 | 3:35 PM

గిరిజనులు నాటు వైద్యానికి స్వస్తి పలకాలి

11-03-2026 01:21 AM

ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పిలుపు

ఉట్నూర్, మార్చి ౧౦ (విజయక్రాంతి): ఏజెన్సీ ప్రాంతంలో నివాసం ఉండే గిరిజనులు నాటు వైద్యానికి స్వస్తి పలికి సర్కారు వైద్యం పొందాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సూచించారు. మంగళవారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కంప్యూటర్ యుగంలో చాలామంది గిరిజనులు నేటికి నాటు వైద్యం వైపు మొగ్గు చూపుతూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటూన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత ఐఏఎస్ అధికారి మడవి తుకారం సైతం నాటు వైద్యంతో ప్రాణాలు కోల్పోయిన సంగతిని ప్రజలు గుర్తించాలన్నారు. ప్రజా పాలన ప్రభుత్వంలో సర్కార్ ఆసుపత్రులకు వచ్చే రోగులకు వైద్యం అందించేందుకు వైద్య సిబ్బందిని, డాక్టర్ల కొరత లేకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర నరసింహ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.

ప్రతి గిరిజన గూడనిక ప్రభుత్వ వైద్యాధికారులు క్రమం తప్పకుండా వచ్చి  వైద్యం అందిస్తున్నారని, వారి వైద్య సేవలను  ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని  సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఏ పిఓ యువరాజ్  మార్మట్, డి.ఆర్.డి.ఓ పి.డి రవీందర్ రాథోడ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అదనపు వైద్యాధికారి డాక్టర్ కూడ్మే తదితరులు త మనోహర్, తహసిల్దార్ ప్రవీణ్ కుమార్, ఎంపీడీవో జీవన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముకాడే ఉత్తం, సర్పంచ్ రాథోడ్ మోహన్ సింగ్, వైద్యురాలు పూజిత  పాల్గొన్నారు.