05-12-2025 08:48:15 AM
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) మరోసారి ఎనిమిది యుద్ధాలను ఆపడం గురించి ప్రగల్భాలు పలికారు. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎనిమిది యుద్ధాలు ఆపానని టముకు వేశారు. త్వరలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని ట్రంప్ వెల్లడించారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య సంధిని కుదర్చడానికి అమెరికా కూడా కృషి చేస్తోందన్నారు. డొనాల్డ్ ట్రంప్ ఇలా అన్నారు. "మేము ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పుతున్నాము. ఇంతకు ముందు ఎవరూ చూడని స్థాయిలో యుద్ధాలను మేము పరిష్కరించుకుంటున్నాము. వాటిలో ఎనిమిది. మేము ఇంకొకదాని కోసం చూస్తున్నాము. అది రష్యా-ఉక్రెయిన్, అది సాధ్యమైతే మేము చివరికి అక్కడికి చేరుకుంటామని నేను అనుకుంటున్నాను. గత వారం, 8,000 మంది సైనికులు చంపబడ్డారు. గత నెలలో, వారు 27,000 మంది సైనికులను అనవసరంగా చంపారు. మేము దానిని ఆపాలి, మేము దాని కోసం చాలా కష్టపడి పనిచేస్తున్నాము," అని ట్రంప్ వెల్లడించారు.
అమెరికా సహకారంతో కాంగో, రువాండా దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత అమెరికా అధ్యక్షుడు కాంగో-రువాండా ప్రభుత్వాలను ప్రశంసించారు. ఈ ప్రాంతంలోని కీలకమైన ఖనిజ నిల్వలను అమెరికా ప్రభుత్వానికి, అమెరికన్ కంపెనీలకు ఇచ్చినందుకు రెండు దేశాల నాయకులను ఆయన ప్రశంసించారు. కాంగో అధ్యక్షుడు ఫెలిక్స్ త్షిసెకెడి, రువాండా అధ్యక్షుడు పాల్ కగామె, ఆఫ్రికన్ దేశాల నుండి అనేక మంది నాయకులతో కలిసి, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న శాంతి ఒప్పందంపై సంతకం చేయడానికి వాషింగ్టన్‌ను సందర్శించారు.