24 June, 2026 | 3:09 AM

పార్టీ కార్యాలయంపై ఉన్న మక్కువ.. పేద ప్రజలపై లేదా?

24-06-2026 02:00 AM

పేదల పక్షాన భూ పోరాటాలు కొనసాగిస్తాం 

మహబూబాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి 1:10 ఎకరాల భూమి కేటాయించి మక్కువ చూపి, నిలువ నీడలేని నిరుపేదలు వేసుకున్న గుడిసెలను తొలగిస్తారా అంటూ సిపిఐ నేతలు నిరసనకు దిగారు.

నీరుపేదల గుడిసెలు తొలగింపు, సిపిఐ నేతల అక్రమ అరెస్టులపై ఆగ్రహించిన సిపిఐ జిల్లా కార్యదర్శి బి. విజయ సారథి ఈ సంఘటనపై వెంటనే ఎంపీ, ఎమ్మెల్యేలు స్పందించాలని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధి అనంతారం శివారు (మోడల్ స్కూల్ దాశరధి స్మృతి వనం ప్రక్కన) సర్వేనెంబర్ 163 ప్రభుత్వ భూమిలో నిరుపేద కుటుంబాలు సిపిఐ పార్టీ భూపోరాటం ద్వారా వేసుకున్న గుడిసెలను ఈరోజు తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో అక్రమంగా, అన్యాయంగా తొలగించగా, అడ్డుకున్న సిపిఐ నేతలు సిపిఐ పట్టణ కార్యదర్శి పెరుగు కుమార్, సహాయ కార్యదర్శి రేషపల్లి నవీన్, నాయకులు కూరాకుల పాల్, మందశంకర్, బాలాజీల అక్రమ అరెస్టులను నిరసిస్తూ, స్థానిక కొత్త కూరగాయల మార్కెట్ తొర్రూర్ బస్టాండ్ నుండి ఇందిరాగాంధీ సెంటర్ మీదుగా తహసిల్దార్ కార్యాలయం వరకు వందలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించి, కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు.

ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి బి. విజయసారథి మాట్లాడుతూ రెవెన్యూ, మున్సిపల్, ఇతర అధికారులు, పెద్దలకు, భూకబ్జా కోరులకు మేలు చేస్తున్నారని, పేదల గుడిసెలను ఉన్నఫలంగా తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం ఇంటి స్థలాలు లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అణగారిన  నిరుపేదవర్గాలకు ఇంటి స్థలాలు ఇచ్చి, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మహబూబాబాద్ మున్సిపా లిటీ పరిధిలో 551,287, 255,163, తదితర సర్వే నెంబర్లలో సుమారుగా 200 ఎకరాల ప్రభుత్వ భూమి పెద్దల చేతుల్లో ఉందని, అధికారులు ఎందుకు స్వాధీనం చేసుకోలేక పోతున్నారో  ప్రజలకు సమాధానం చెప్పాలని, ఆభూములను  వెనక్కి తీసుకొని, పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయా నికి ఒక ఎకరం 10 గుంటల భూమి కేటాయించినట్లుగా రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ అధికారులు, మాతో చెప్పాగా అందులో వేసిన గుడిసెలను మేము సానుకూలంగా స్పందించి తొలగించుకోవడం జరిగింది.

పక్కనే ఉన్నటు వంటి ప్రభుత్వ ఇతర భూమిలో అధికారుల హామీ మేరకు వేసుకోగా , మాట ఇచ్చి  తప్పిన అధికారులు అర్ధరాత్రి తెల్లవారుజామున మా గుడిసెలు తొలగించడం సరి అయింది కాదని విమర్శిం చారు. పాలక ప్రభుత్వం పేదల కోసమా పెద్దల కోసమా  ఆలోచించుకోవాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో రావడానికి 118 నియోజక వర్గాల్లో  సిపిఐ పార్టీ పనిచేసి గెలిపించిందని, అలాంటి మా సిపిఐ పార్టీ భూ పోరాటం ద్వారా వేసిన గుడిసెలను తొలగించడం ఎంతవరకు కరెక్టో ఆలోచించుకోవాలని గుర్తు చేశారు.

ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి. అజయ్ సారధి రెడ్డి, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి చింతకుంట్ల వెంకన్న, జిల్లా కార్యవర్గ సభ్యులు, కౌన్సిల్ సభ్యులు కట్లోజు పాండురంగ చారి, మామిండ్ల సాంబలక్ష్మి, నర్రా శ్రావణ్, వెలుగు శ్రావణ్, ఎండి ఫాతిమా, బానోత్ లింగ్యానాయక్, వంకాయల పాటి చిరంజీవి, ఎండి మహిమూద్, కేదాసు రమేష్ తదితరులు పాల్గొన్నారు.