30 June, 2026 | 2:10 AM

హత్యాయత్నం కేసులో ఇద్దరు అరెస్ట్, రిమాండ్

30-06-2026 12:00 AM

వ్యక్తిగత కక్షతో కారుతో ఢీకొట్టి, కర్రతో దాడి చేసిన నిందితులు 

మారుతి 800 కారు, చెక్క కర్ర, ఐఫోన్ మొబైల్ ఫోన్ స్వాధీనం

సదాశివనగర్ ఎస్హెచ్‌ఓ  పుష్పరాజ్

సదాశివనగర్, జూన్ 29 (విజయక్రాంతి): వ్యక్తిగత కక్షతో కారుతో ఢీ కొట్టి కర్రతో దాడి చేసిన ఇద్దరు నిందితులను సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు సదాశినగర్ ఎస్ హెచ్ ఓ పుష్పరాజు తెలిపారు.

తేదీ 27-06-2026 రాత్రి సుమారు 08:00 గంటల సమయంలో, ధర్మారావుపేట గ్రామానికి చెందిన గైని రమేష్ తన మోటార్ సైక్పి వెళ్తుండగా, గుర్తు తెలియని కారు వెనుక నుండి ఢీకొట్టి, అనంతరం చెక్క కర్రతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడినట్లు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

గతంలో నమోదైన క్రిమినల్ కేసు కారణంగా ఏర్పడిన వ్యక్తిగత కక్షతో ధర్మారావుపేట గ్రామానికి చెందిన గాండ్ల లావణ్య, ఆమె తమ్ముడు గాండ్ల సతీష్ ముందస్తు పథకం ప్రకారం గైని రమేష్ను హత్య చేయాలనే ఉద్దేశ్యంతో కారుతో అతని మోటార్ సైకిల్ను వెనుక నుంచి ఢీకొట్టి, అనంతరం చెక్క కర్రతో దాడి చేసినట్లు గుర్తించినట్లు తెలిపారు.

సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్, సాక్షుల వాంగ్మూలాలు, ఇతర దర్యాప్తు ఆధారాల మేరకు నిందితులు గాండ్ల లావణ్య , గాండ్ల సతీష్లను అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి ఘటనలో ఉపయోగించిన మారుతి 800 కారు, చెక్క కర్ర, ఐఫోన్ మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఘటన స్థలం నుంచి ఇతర భౌతిక ఆధారాలను కూడా సీజ్ చేశారు. నిందితులను రెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు ఎస్‌హెచ్‌ఓ తెలిపారు. చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని సూచించారు.