11-07-2025 04:51:17 PM
దేవరకొండ బస్టాండ్ లో ప్రత్యక్షం
మెరుపు వేగంతో స్పందించిన టూటౌన్ పోలీసులు
నల్గొండ టౌన్,(విజయక్రాంతి): నల్గొండ జిల్లా కేంద్రంలో ఇద్దరి చిన్నారుల మిస్సింగ్ కలకలం సృష్టించింది. ట్యూషన్ కు వెళ్తున్నామని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన పిల్లలు రాత్రి అయినా రాకపోయేసరికి తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మెరుపు వేగంతో స్పందించిన నల్లగొండ జిల్లా పోలీసులు గంటల వ్యవధిలోనే చిన్నారులను గుర్తించి శుక్రవారం పట్టుకున్నారు. సమాచారం ప్రకారం... జిల్లా కేంద్రానికి చెందిన ఇద్దరు 9వ తరగతి విద్యార్థులు గురువారం సాయంత్రం ట్యూషన్ కు పోతున్నామని ఇంట్లో నుంచి బయటకు వెళ్లారు.
రాత్రి అయ్యే సరికి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు కంగారు పడ్డారు. రాత్రి 9 గంటల వరకు స్నేహితులు, బంధువులకు ఫోన్లు చేసి వాకాబు చేశారు. అయినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో వెంటనే నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన టూ టౌన్ ఎస్ఐ సైదులు వెంటనే సిబ్బందిని అలర్ట్ చేశారు. పిల్లల ఇంటి నుంచి ట్యూషన్ కు వెళ్లే దారుల్లో ఉన్న సీసీ కెమెరాలను జల్లడబట్టారు. ఇద్దరు చిన్నారులు దేవరకొండకు వెళ్లారని నిర్ధారించారు. వెంటనే ఎస్ఐ సైదులు దేవరకొండ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
వెంటనే ఆ పోలీసులు బస్టాండ్లో ఉన్న ఇద్దరు చిన్నారులను అదుపులోకి తీసుకొని నల్లగొండ పోలీసులకు అప్పగించారు. పిల్లలు మిస్సింగ్ అయిన రెండు గంటల్లోనే ట్రేస్ చేసి చిన్నారులను టూ టౌన్ ఎస్ఐ సైదులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఫిర్యాదు అందుకున్న క్షణాల్లోనే స్పందించిన టూ టౌన్ ఎస్ఐ, సిబ్బందిని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు. అయితే పిల్లలు ఎందుకు దేవరకొండ వెళ్లారు.? వాళ్లు ఒక్కరే వెళ్లారా.. ఇంకా ఎవరైనా తీసుకెళ్లారా..? అసలు మిస్సింగ్ కారణం ఏంటి అన్నది తెలియరాలేదు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.