ఇద్దరు ఎక్సైజ్ అధికారులు సస్పెన్షన్
- భద్రాచలంలో గంజాయి కేసు నిందితుడి పరారీ ఘటన..
- ఖమ్మం డీసీపీ నివేదికపై ఎక్సైజ్ కమిషనర్ చర్యలు
- సమగ్ర విచారణకు ఆదేశం
భద్రాచలం, ఆగస్టు 26 (విజయక్రాంతి): భద్రాచలంలో గంజా యి కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న మాధబ హంతల్ ఎక్సైజ్ అధికారుల కస్టడీ నుంచి పరారైన ఘటనకు సంబంధించి ఇద్దరు ఎక్సైజ్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. నిందితుడు కస్టడీ నుంచి పరారైన ఘటనను కప్పిపుచ్చేందుకు తప్పుడు పంచనామా, కేసుకు సంబంధించిన రికార్డులు సృష్టించారన్న ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు చర్యలు చేపట్టిన ఘటన బుధవారం వెలుగులోకొచ్చింది.
ఆగస్టు 5న ఖమ్మం డీసీపీ విచారణ నివేదికను ఎక్సైజ్ కమిషనర్ సి. హరికిరణ్ పరిశీలించి శాఖాపరమైన చర్యలకు ఆదేశించారు. దీంతో పీఈఐ/ఎస్‌హెచ్‌వో ఎస్కే. రహీమున్నీసా బేగం, కానిస్టేబుల్ సీహెచ్. రవికుమార్‌లను సస్పెండ్ చేస్తూ ఆగస్టు 24న ఉత్తర్వులు జారీ చేశారు. విచారణ అనంతరం మరిన్ని చర్యలుండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కాగా నిందితుడి పరారీ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది.






