రాష్ట్ర మంత్రులను కలిసిన బీటీపీఎస్ స్థానిక కాంట్రాక్టర్లు
కాంట్రాక్టు పనుల కార్పొరేటీకరణ విరమించుకోవాలని మంత్రులకు మెమోరాండం
సీఎం దృష్టికి తీసుకెళ్లి జెన్‌కో సీఎండీ లతో చర్చించి పరిష్కారిస్తామని హామీ
పినపాక, ఆగస్టు 26 (విజయక్రాంతి): బీటీపీఎస్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలోని కాంట్రాక్టు పనులు విలీనం (మెర్జ్ ) చేసి, కార్పొరేటీకరణ చేసేందుకు జెన్కో యాజమాన్యం నిర్ణయం తీసుకుని, ఇప్పటికే అమలుకు ఆదేశాలు జారీ చేయడం పట్ల స్థానిక కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారు.
బీ టీ పి ఎస్ లో పనులు నిర్వహిస్తున్న స్థానిక కాంట్రాక్టర్లకు ఉపాధి లేకుండా పోతుండటం పట్ల స్థానిక కాంట్రాక్టర్లు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఎంపీ బలరాం నాయక్ ఆధ్వర్యంలో హైద్రాబాద్ లోని పలువురు మంత్రులను కలిసి మెమోరాండం అందించారు.
బీటీపీఎస్ నిర్మాణం సందర్బంగా పీసా గ్రామ సభలు నిర్వహించి భూ సేకరణపై ప్రజాభిప్రాయ సేకరణ చేశారని, ఆ సందర్భం లోనే స్థానికులకు 100 శాతం ఉపాధి, కాంట్రాక్టు పనులు ఇస్తామని లిఖిత పూర్వక హామీ ఇచ్చిన విషయాన్ని మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ హామీలను ప్రకారం తమ సమస్యలను పరిష్కారం చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎస్సి, ఎస్ టీ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ లకు సమస్యల మెమోరాండం ఇచ్చారు.
సమస్యలు విన్న మంత్రులు తక్షణమే స్పందించి, జెన్కో సీఎండీ తో చరవాణిలో మాట్లాడారు. లోకల్ కాంట్రాక్టర్స్ అంతా 5 వ షెడ్యూల్ ప్రాంతం లోని బీ టీ పీ ఎస్ పరిధిలోని ప్రభావిత గ్రామాలకు చెందినవారని, కాలుష్యం ప్రభావమున్నప్పటికీ రెండు పంటలు పండే భూములను బీటీపీఎస్ నిర్మాణానికి ఇచ్చారన్నారు. బీ టీ పి ఎస్ వల్ల ఇన్నాళ్లు స్థానికంగా ఉన్న చిన్న చిన్న వర్కులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్న తమకు కొత్తగా జెన్కో యాజమాన్యం వర్కులన్నింటిని విలీనం చేసి కార్పొరేట్ కంపెనీలకు ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతుండటం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానిక కాంట్రాక్టర్ల ఉపాధి పాలిట కార్పొరేట్ గుడిబండ ను తీసుకొచ్చిన జెన్కో యాజమాన్యం తక్షణమే రద్దు సర్కులర్ ను జారీ చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. జెన్కో సీఎండీ దృష్టికి తీసుకెళ్లి, సమస్య పరిష్కారానికి, తదుపరి చర్యలు నిమిత్తం ఉన్నతాధికారులతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. తమ సమస్యలపై సానుకూలంగా స్పందించడం పట్ల లోకల్ కాంట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదములు తెలిపారు.






