calender_icon.png 8 November, 2025 | 5:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మికులకు ఉచిత ప్రమాద బీమా పథకం...

08-11-2025 03:18:37 PM

- దేశానికే ఆదర్శంగా సింగరేణి...

- ఒప్పంద కార్మికులకు రూ. 50 లక్షలు..,

- ఉద్యోగుల సహజ మరణానికి రూ. 20 లక్షలు

- ప్రధాన బ్యాంకులను కోరిన సింగరేణి సీఎండీ 

మంచిర్యాల,(విజయక్రాంతి): సింగరేణిలో ఉద్యోగులు, ఒప్పంద కార్మికుల కోసం ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల సహకారంతో దేశంలోనే తొలిసారిగా ప్రారంభించిన ఉచిత ప్రమాద బీమా పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత ప్రమాద బీమా పథకాన్ని తమ సంస్థల్లో అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాయి. సింగరేణిలో అమలు చేస్తున్న ఈ బీమా పథకాన్ని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి. ఇప్పటికే కోలిండియాలో అమలైంది. మరోవైపు సింగరేణి సంస్థ వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా థర్మల్ పవర్ ప్లాంట్లను, సోలార్ ప్లాంట్లను, పంప్డ్ స్టోరేజీ ప్లాంట్, తదితర ప్రాజెక్టులను త్వరలో చేపట్టేందుకు ప్రణాళికలను రూపొందిస్తుంది. 

రూ. 30 కోట్ల బీమా అందజేత...

సింగరేణి సంస్థలో ఉచిత ప్రమాద బీమా పథకం ద్వారా సింగరేణి ఉద్యోగులకు, ఒప్పంద కార్మికులకు మేలు జరుగుతుంది. సింగరేణిలో గరిష్టంగా రూ. 1.25 కోట్ల వరకు, పొరుగు సేవల సిబ్బందికి రూ.40 లక్షల వరకు బీమా అందించారు. ఇప్పటి వరకు వివిధ ప్రమాదాల్లో మరణించిన 34 మందికి దాదాపు రూ.30 కోట్ల బీమా సొమ్మును బ్యాంకుల ద్వారా అందించారు.

ఇది కార్మిక కుటుంబాలకు ఆర్థిక భద్రతను కల్పించిందని చెప్పవచ్చు. అయితే ఒప్పంద కార్మికులకు కనీసం రూ.50 లక్షల ప్రమాద బీమా, సింగరేణి ఉద్యోగి ఒక వేళ సహజ మరణం పొందితే కనీసం రూ.20 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ ఇచ్చే విషయంలోనూ సానుకూల నిర్ణయం తీసుకోవాలని సింగరేణి యాజమాన్యం బ్యాంకర్లను విజ్ఞప్తి చేస్తుంది. 

ఏడు ప్రధాన బ్యాంకులతో...

సింగరేణిలో మొదలు పెట్టిన ఈ ఉచిత ప్రమాద బీమా పథకాన్ని ఏడు ప్రధాన బ్యాంకుల అనుసంధానంతో ప్రారంభించింది. ఉద్యోగులు, కార్మికుల కోసం అనుసంధానమైన బ్యాంకులలో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ), బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ), హెచ్డీఎఫ్సీ బ్యాంకులు ఉన్నాయి. సింగరేణిలో నూతన ప్రాజెక్టుల ఏర్పాటు నేపథ్యంలో ఈ బ్యాంకులను సంస్థ రుణ సదుపాయం కోరనుంది. దీని వల్ల ఇరు సంస్థలకు వాణిజ్య పరమైన లబ్ధి చేకూరనుంది. 

బ్యాంకర్లతో సీఎండీ సమావేశం...

సింగరేణి సంస్థ ఉద్యోగుల కోసం అందిస్తున్న ప్రమాద బీమా సదుపాయాన్ని మరింత పెంచే ప్రతిపాదనల కోసం సింగరేణి భవన్ లో శని వారం సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ ప్రధాన బ్యాంకుల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా సింగరేణి చేపట్టబోయే ప్రాజెక్టులకు రుణ సదుపాయం అందించాలని, దీనితో సింగరేణి సంస్థకు, బ్యాంకుల మధ్య వాణిజ్యపరమైన లబ్ధి చేకూరనుందని, సింగరేణితో దీర్ఘకాల వాణిజ్య బంధాన్ని కొనసాగించేందుకు సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఒప్పంద కార్మికులకు కనీసం రూ.50 లక్షల ప్రమాద బీమా, సింగరేణి ఉద్యోగి ఒక వేళ సహజ మరణం పొందితే రూ.20 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ ఇచ్చే విషయంపై సీఎండీ బ్యాంకర్లను విజ్ఞప్తి చేశారు.