05-05-2025 04:03:08 PM
పర్యవేక్షించిన కలెక్టర్
మహబూబాబాద్,(విజయక్రాంతి): భూభారతి చట్టం అమలులో భాగంగా మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ మేరకు ఆ మండలంలోని పెద్ద ముప్పారం ఆగాపేట, రాజవరం, మేఘ్యా తండా, దుబ్బ తండ గ్రామాల్లో భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆయా గ్రామాలను సందర్శించి గ్రామసభల్లో ప్రజల నుంచి భూ సమస్యలపై స్వీకరిస్తున్న దరఖాస్తుల తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా భూభారతి చట్టం అమల్లో భాగంగా 28 జిల్లాల్లో భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా మహబూబాబాద్ జిల్లాలో దంతాలపల్లి మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారని, ఈ మండల పరిధిలో ఉన్న రైతులు ఆయా గ్రామాల్లో నిర్వహించే రెవెన్యూ సదస్సులో పాల్గొని తమ భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను అధికారులకు అందజేయాలని సూచించారు.
భూ సమస్యల పరిష్కారానికి గతంలో రైతులు తహసిల్దార్, ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు అధికారులే స్వయంగా మీ గ్రామానికి వస్తున్న నేపథ్యంలో ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామస్థాయిలో ప్రజల నుంచి అధికారులు స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించిన తర్వాత అర్హతను నిర్ధారించి సంబంధిత ఉత్తర్వులను జారీ చేస్తారని, నెల రోజుల వ్యవధిలో సమస్యకు పరిష్కారం చూపుతారని చెప్పారు. గ్రామాల్లో నిర్వహించే రెవెన్యూ సదస్సులో ప్రజలకు ఇబ్బందులు కలవకుండా తాగునీటి వసతి నీడ కుర్చీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రెవెన్యూ సదస్సుల కార్యక్రమంలో ఆర్డీవో గణేష్ దంతాలపల్లి తహసిల్దార్ సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.