23-01-2025 12:00:00 AM
తెలంగాణలోని విశ్వవిద్యాలయాలను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న కృషికి విశ్వవిద్యాలయాల ఉపకులపతులు తూట్లు పొడుస్తున్నారు. రాష్ట్రంలో గత పదేళ్లుగా ఉన్నత విద్యాసంస్థలను నిర్లక్ష్యం చేసింది గత ప్రభుత్వం.
ప్రస్తుతం విద్యాసంస్థల బలోపేతానికి నిరంతరం పాటుప డుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుమతితో రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న ఒప్పంద (కాంట్రాక్ట్) అధ్యాపకుల పదవీ విరమణ వయసు 60 సంవ త్సరాలు నిండినప్పటికీ యధావిధిగా కొనసాగించాలని గత ఏడాది ఆగస్టులో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మండలి అన్ని విశ్వవిద్యాలయాలకు పంపించిన ఉత్తర్వులను విశ్వవిద్యాలయాలలో ఎక్కడా అమలు చేయడం లేదని తెలుస్తోంది.
స్వయంగా విద్యాశాఖను పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి ఆదేశాలతో వెలుపడ్డ ఉత్తర్వులనే విశ్వవిద్యాలయాల అధికారులు పాటించడం లేదని ఒప్పంద అధ్యాపకుల సంఘం అంటోంది.
పదేళ్లుగా జరగని అధ్యాపకుల నియామకం
గత పది సంవత్సరాలుగా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలలో అధ్యాపకుల నియామకం జరగలేదు. దీంతో విశ్వవిద్యాలయా లలో బోధన పూర్తిగా కుంటుపడింది. పరిశోధన పూర్తిగా పడకేసింది. ఈ విషయాన్ని గమనించిన ముఖ్యమంత్రి చొరవతో విశ్వవిద్యాలయాల ఉపకులపతులను నియమి స్తూ రాష్ట్ర గవర్నర్ అక్టోబర్ 19న ఉత్తర్వులను జారీ చేశారు. గత ప్రభుత్వం గత పదే ళ్లుగా వర్సిటీలపట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహించిన విషయం తెలిసిందే.
అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను కేజీ నుం డి పీజీ వరకు సంస్కరించడానికి కంకణం కట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా విశ్వవిద్యాలయాలలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోంది. విశ్వవిద్యాలయా లలో, విద్యా వ్యవస్థలో సమస్యలు పరిష్కారానికి కమిషన్ ఏర్పాటు చేసింది. రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టుల భర్తీ కోసం ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో ప్రణాళికలు రూపొందించాలని సూచించింది.
డిగ్రీ స్థాయిలో బోధన విధానంలో పాఠ్యప్రణాళికలో సమూలమైన మార్పులు, అదే విధంగా అధ్యాపక నియామకాల విషయంలో చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణా ళికను విద్యామండలి చేపడుతోంది. అయి తే రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న అధ్యాపకుల వయసును 65కు పెంచాలని ప్రభుత్వానికి అన్ని విశ్వవిద్యాలయాల నుండి అధ్యాపక సంఘాలు సూచించా యి. ఈ విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
కానీ విశ్వవిద్యాలయాలలో బోధ న, ఒప్పంద పార్ట్‌టైం అధ్యాపకులచే కొనసాగుతున్న విషయం ప్రభుత్వానికి తెలిసిం ది. కాబట్టి 60ఏళ్లు నిండిన ఒప్పంద అధ్యాపకులను యధావిధిగా కొనసాగించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి అన్ని విశ్వవిద్యాలయాలకు సర్కులర్ జారీ చేసిం ది. అయితే ఒప్పంద అధ్యాపకుల వయ సు పెంపు విషయంలో విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న అధ్యాపకులు వ్యతిరేకిస్తు న్నట్లు కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి.
రాష్ట్రంలో పనిచేస్తున్న విశ్వవిద్యాలయాల అధ్యాపకుల జీతభత్యాలను పరిశీలిస్తే ఒక ప్రొఫెసర్‌కు నెలకు రూ.3 .5 లక్షల వరకు ఇస్తున్నారు. అదే ఒప్పంద అధ్యాపకులకు 60 వేల వరకు చెల్లిస్తున్నారు. వీరిద్దరి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఒకసారి గమనించాలి.
ఉన్నత విద్యను బలోపేతం చేయాలంటే సీనియర్ అనుభవం ఉన్న అధ్యాప కులు ఎంతైనా అవసరం. రిటైర్ అయిన అధ్యాపకులను వైస్ ఛాన్స్‌లర్‌గా నియమించవచ్చుగాని, 60 ఏళ్లు నిండిన కాం ట్రాక్ట్ అధ్యాపకులను మాత్రం పొడిగించవద్దా! అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలలో మొత్తం 1,997కు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
ఉన్నతవిద్య బలోపేతం దిశగా..
తెలంగాణ రాష్ట్రంలో 2014 నుండి 2024 వరకు కేజీ నుండి పీజీ స్థాయి వరకు విద్యావ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా ఉందని చెప్పవచ్చు. అధికారంలోనికి వచ్చి న తర్వాత కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని ప్రకటించిన ప్రభుత్వం అసలు ఆ దిశగా అడుగులు వేయలేదని చెప్పాలి. ప్రాథమిక విద్య, ఉన్నత విద్య రెండూ నిర్లక్ష్యానికి గురయ్యాయని చెప్పా లి. ముఖ్యంగా పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో అనేకసార్లు లోపాలు బట్టబయలు అయ్యాయి.
పరీక్ష ల మూల్యాంకనం, పరీక్షల నిర్వహణ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పైగా ఫీజులు పెంచి, ప్రైవేటు విశ్వవిద్యాలయాలను అనుమతించి ఉన్నత విద్యను పేదల కు దూరం చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాల యం అంతర్జాతీయ ఖ్యాతిని గడించి ఎంతోమంది పరిశోధకులకు, పర్యాటకులకు విద్యావంతులకు స్ఫూర్తిగా నిలిచింది. నేడు అదంతా గతకీర్తిగా మిగిలింది.
రాష్ట్రంలోని వర్సిటీలు తెలంగాణ సాధనతో పాటు అనేక ప్రజా ఉద్యమాలకు ఊపిరి పోసిన కేంద్రాలుగా మిగిలిపోయినప్పటికీ నిధులు, సిబ్బంది కొరత, నిర్ల క్ష్యం కారణంగా కళావిహీనమై అక్కడక్కడ శిథిలావస్థకు చేరుకోవడం అత్యంత విచారకరం. గత ప్రభుత్వంలో 2016లో తొలి సారిగా వీసీల నియామకం జరిగిన తర్వా త 2019లో మళ్లీ ఇన్చార్జిల పాలన కొనసాగింది.
ఆ తర్వాత 2021లో ఉపకులప తుల నియామకాలను చేపట్టినప్పటికీ ప్రభుత్వం తనకు అనుకూలమైన వారిని నియమించుకున్నట్లు అనేక ఆరోపణలు ఉన్నాయి.కొత్తగా మహిళా, ఫారెస్ట్ యూనివర్సిటీలను ప్రభుత్వం ప్రారంభించినప్ప టికీ ఉన్న వాటికే కనీస సౌకర్యాలు, ఫ్యాక ల్టీ లేని పరిస్థితులలో కొత్త వాటికి సదుపాయాలు ఎలా కల్పిస్తారోనన్న అనుమానా లు కలుగుతున్నాయి. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళనలు నెలల తరబడి సాగిన సందర్భం మనందరికీ తెలిసిందే.
పదేళ్లుగా జరగని నియామకాలు
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు కూడా యూనివర్సిటీలలో నియామకాలు లేవు. పైగా 24 శాతం మాత్రమే రెగ్యులర్ పోస్టులు ఉంటే మిగతాఅన్నీ తాత్కాలిక, కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగుతూ ఉండడాన్ని గమనిస్తే మన విశ్వవిద్యాలయ విద్య ఎంత దుస్థితిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.
ఒక అంచనా ప్రకారంగా రాష్ట్రంలో 8,000 బోధన, బోధనేతర ఖాళీలు ఉన్నాయని 2020లో ప్రభుత్వమే ప్రకటించినప్పటికీ రెగ్యులర్ ఉద్యోగులతో భర్తీ చేయకుండా కాంట్రాక్టు, పార్ట్ టైం పద్ధతిలో భర్తీ చేసిన కారణంగా కొన్ని కోర్సులు మూసివేయ డం, పరిశోధకులు విరమించుకోవడం, అవకాశాలు లేక విద్యార్థులు డ్రాప్ అవు ట్ కావడం జరిగినట్టుగా తెలుస్తున్నది.
ఇక ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు నిధులు మంజూరు లేకపోవడం, వీసీలు అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నట్లు, ఆ కారణంగానే వివిధ కోర్సుల ఫీజును భారీగా పెంచినట్లు తెలుస్తున్నది. తెలంగాణ రాకముందు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 3000 నుంచి 5000 రూపాయలు ఉన్న కోర్సు ఫీజును 35వేల కు, 2000 రూపాయలు ఉన్న పీహెచ్‌డీ ఫీజును 20 వేలకు పెంచారు.
ప్రభుత్వంపై అదనపు బాధ్యత
పొరుగు రాష్ట్రమైన ఏపీలో ముఖ్యమం త్రి అనేక సందర్భాలలో విద్యారంగం మీద సమీక్ష చేసిన చరిత్ర ఉంది. కానీ మన రాష్ట్రంలో ప్రాథమిక విద్య నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు విద్యారంగంపైన ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్ష చేసిన సం దర్భం లేదనే చెప్పాలి. కొత్త ప్రభుత్వం వెంటనే రాష్ట్రంలోని విశ్వవిద్యాలయ వీసీ లు లేదా నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసి సిబ్బంది, మౌలిక సౌకర్యా లు, పేద విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి నిధులు మంజూరు చేసివర్సిటీ విద్యను మెరుగుపరచాలి.
పెం చిన కోర్సుల ఫీజులు, పీహెచ్‌డీ ఫీజులను తగ్గించాలి. సామాజిక, ఆర్థిక, వ్యవసాయ రంగాలకు సంబంధించిన అంశాల పైన మరిన్ని పరిశోధనలకు అవకాశాన్ని కల్పి స్తూ ఆర్థికంగా సహకరించి ప్రోత్సహించా లి. విశ్వవిద్యాలయాలతో పాటు వాటి అనుబంధ కళాశాలలను కూడా అభివృద్ధి పరిచే క్రమంలో మౌలిక సౌకర్యాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి విద్యారంగాన్ని పరిపుష్టి చేయవలసిన అవసరం ప్రస్తుత ప్రభుత్వంపై ఉన్నది.