calender_icon.png 29 October, 2025 | 10:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వలసలపై ట్రంప్ కత్తి

24-01-2025 12:00:00 AM

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన నాటినుంచి అగ్రరాజ్యంలో నివసిస్తున్న లక్షలాది వలసజీవులకు నిద్ర లేకుండా చేస్తున్నారు. గ్రీన్‌కార్డు ఉన్నంతమాత్రాన అమెరికా పౌరులు అయిపోలేరంటూ టీజర్ విడుల చేసిన ట్రంప్ ఇప్పుడు ఇంకో టీజర్ సిద్ధం చేశారు. వలసదారుల పాలిట సింహస్వప్నంలాంటి ‘లేకెన్ రిలే’ చట్టాన్ని కచ్చితంగా అమలు చేస్తామని, ఇక అమెరికాలో చిన్నపాటి నేరాలను సైతం తీవ్రంగా పరిగణించి స్వదేశానికి తిప్పి పంపుతామని ఆయన అంటున్నారు.

మరోవైపు అక్రమ వలసదారుల బహిష్కరణకు సంబంధించిన కీలక బిల్లుకు తాజాగా అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. అధ్యక్షుడిగా ట్రంప్ సంతకం చేసే తొలి బిల్లు ఇదే అయ్యే అవకాశం ఉంది. దొంగతనాలు, తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకునేలా రూపొందించిన ఈ బిల్లుకు బుధవారం ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. దీంతో బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం లభించినట్లయింది.

కాగా అమెరికాలో అక్రమ వలసదారులు ఎంతమంది ఉన్నారనేదానికి సంబంధించి కచ్చితమైన లెక్కలు లేవు. అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ లెక్కల ప్రకారం 2022 జనవరి నాటికి దాదాపు 1.1 కోట్లమంది అక్రమ వలసదారులు అమెరికాలో నివసిస్తున్నారు. వీరిలో దాదాపు 2.20 లక్షల మంది భారతీయులు ఉన్నట్లు కూడా ఆ శాఖ పేర్కొంటోంది. అయితే ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి.

వాస్తవానికి మెక్సికో, ఎల్ సాల్వడార్ తర్వాత అక్రమవలసదారుల విషయంలో భారత్ మూడో స్థానంలో ఉందనేది ఆ నివేదికల సారాంశం. అయితే అధ్యక్ష ఎన్నికల సమయంలో అమెరికా ప్రభుత్వం తమ దేశంలోకి ఇలా అక్రమంగా  వచ్చిన వారికి సంబంధించిన లెక్కలు తీసింది. ఆ లెక్కల ప్రకారం దాదాపు 18 వేల మంది భారతీయులు ఇలా సరయిన పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్నట్లు తేలింది.

వీరందరినీ తక్షణం వెనక్కి పంపించడానికి ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం చర్యలు  మొదలుపెట్టినట్లు వార్తలు వస్తున్నయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రమాణ స్వీకారానికి అమెరికా వెళ్లిన విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సరైన పత్రాలు లేకుండా వలస వెళ్లిన భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. న్యాయపరమైన వలసలకే తాము పూర్తిగా మద్దతు ఇస్తామని వెల్లడించారు.

అంటే అమెరికా చెప్తున్న ఆ 18 వేలమంది భారతీయులను వెనక్కి తీసుకు రావడానికి మన దేశం సిద్ధంగా ఉంది. మరి మిగతా వారి సంగతి ఏమిటి?   వారి విషయంలో మోదీ ప్రభుత్వ వైఖరి ఏమిటి? వాస్తవానికి గతంలో మన దేశంనుంచి అమెరికా వెళ్లే వారిలో చాలామంది చట్టబద్ధమైన పత్రాలతోనే  వెళ్లేవారు. అయితే ఇటీవలి సంవత్సరాల్లో అమెరికా మోజు పెరగడంతో అక్రమ వలసలు పెరిగినట్లు చెబుతున్నారు.

ముఖ్యంగా కెనడా మీదుగా అమెరికాలో అడుగుపెట్టే భారతీయుల సంఖ్య పెరిగినట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి. మరోవైపు అమెరికా, కెనడాలో ఖలిస్థానీ వేర్పాటువాదులకు మద్దతు ఇచ్చే  వారిలో కొందరు అక్రమ వలసదారులు ఉన్నారని భారత్ భావిస్తోంది. వీరిని కట్టడి చేయడం వల్ల ఆ ఉద్యమం బలహీనమవుతుందనేది కేంద్రం ఆలోచన.

వచ్చే నెలలో ట్రంప్ భారత్‌లో పర్యటించే అవకాశాలున్న నేపథ్యంలో ఈ వ్యవహారం ఇరుదేశాల వాణిజ్య సంబంధాలపై ప్రభావం చూపకుండా చూడాలనికూడా మోదీ సర్కార్ భావిస్తోంది.

మోదీకి ట్రంప్ మంచి మిత్రుడు కావడం కూడా అక్రమవలసదారులను వెనక్కి తీసుకురావడానికి ప్రభుత్వం అంగీకరించడానికి ఒక కారణంగా చెప్తున్నారు. అయితే అక్రమవలసదారులందరినీ అమెరికానుంచి పంపించి వేయడం అంత సులభం కాదని, దానికి బడ్జెట్ సరిపోదనేది నిపుణుల భావన. ఏది ఏమయినా ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమెరికాలో ఉంటున్న లక్షలాది భారతీయులతో పాటు అక్కడికి వెళ్లాలనుకుంటున్న వారిలోనూ   గుబులు పుట్టిస్తున్న మాటమాత్రం నిజం.