కరీంనగర్ డెయిరీ చైర్మన్ రాజేశ్వరరావుకు మేరీల్యాండ్ యూనివర్సిటీ డాక్టరేట్
కరీంనగర్, జూలై 13 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో పాలు ఉత్పత్తి చేసే రైతుల సాధికారత, పాల విప్లవాన్ని ప్రారంభించడం లో చేసిన విశేష సేవలకు గుర్తింపుగా కరీంనగర్ డెయిరీ చైర్మన్ సి రాజేశ్వరరావుకు అమెరికాలోని మేరీల్యాండ్ స్టేట్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ను ప్రకటించింది. ఈ నెల 19న న్యూఢిల్లీలోని లోధి రోడ్లో ఉన్న ’ఇండియా హ్యా బిటాట్ సెంటర్’లోని ’గుల్మోహర్’లో జరిగే కార్యక్రమంలో రాజేశ్వరరావుకు డాక్టరేట్ కు ప్రదానం చేయనున్నారు.
వ్యవసాయ పట్టభద్రు లైన రాజేశ్వరరావు పాడి పరిశ్రమ రంగంలోనూ, రైతుల సాధికారత దిశగానూ అవిశ్రాంత కృషి చేశారు. వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమను అదనపు ఆదాయ వనరుగా చేపట్టేలా రైతులకు అవగాహన కల్పించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. రాజేశ్వరరావు నాయకత్వంలో కరీంనగర్ డెయిరీ అద్భుతమైన వృద్ధిని సాధించి, పాలు, పాల ఉత్పత్తుల సేకరణ అలాగే అమ్మకాల పరంగా తెలంగాణ రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచింది.
మార్కెట్ పరిధిని విస్తరించడానికి, రైతుల ఆదాయాన్ని పెంచడానికి దోహదపడేలా ఆయన అనేక కొత్త ఉత్పత్తుల తయారీకి చర్యలు చేపట్టారు. ప్రస్తుతం లక్ష మందికి పైగా రైతులు కరీంనగర్ డెయిరీకి పాలను సరఫరా చేస్తున్నారు. ఈ ప్రాంతంలో పాల ఉత్పత్తిని పెంచేందుకు, రైతులు మరియు పాడి పశువుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను ప్రారంభించడంలో కీలక పాత్ర పోషించారు. 1971లో 12,000 లీటర్ల సామర్థ్యంతో ప్రారంభమైన ఈ డెయిరీ నేడు నుస్తుల్లాపూర్ మండలం నల్లగొండ గ్రామంలోని భారీ మెగా డెయిరీ కేంద్రంతో 3 లక్షల లీటర్లకు పైగా సామర్థ్యానికి విస్తరించింది. డెయిరీ తోపాటు, చైర్మన్ కు అనేక అవార్డు లభించాయి. డాక్టరేట్ లభించడం పట్ల రాజేశ్వరరావును పలువురు అభినందించారు.






