calender_icon.png 5 January, 2026 | 3:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళల్లో మూత్ర నాళాల సమస్యలు

04-01-2026 12:00:00 AM

పురుషులతో పోలిస్తే మహిళల్లో మూత్ర సంబంధమైన సమస్యలు, ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. మహిళల దేహనిర్మాణ పరమైన ప్రత్యేకతలే ఇందుకు కారణం. మహిళల్లో మూత్రనాళం చిన్నగా ఉంటుంది. అది వారి జననేంద్రియాలకు దగ్గరగా ఉండటం వల్ల ఈ తరహా ఇన్‌ఫెక్షన్లు ఎక్కువ అని రెనోవా సెంచరీ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, యూరోగైనకాలజిస్ట్, డాక్టర్ లలిత కె చెపుతున్నారు.

ఎలాంటి సమస్యలొస్తాయంటే

మహిళల్లో వచ్చే మూత్రసంబంధ సమస్యల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్, యూరినరీ ఇన్ కాంటినెన్స్ (చిన్నచిన్న కారణాలతో.. అంటే దగ్గినప్పుడు, నవ్వినప్పుడు తమ ప్రమేయం లేకుండానే మూత్రం కారిపోతూ ఉండటం), మూత్ర విసర్జన సమయంలో మంట, తరచూ మూత్రవిసర్జనకు వెళ్లాల్సిరావడం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇన్‌ఫెక్షన్ మరీ ఎక్కువైతే మూత్రంలో రక్తం కూడా కనిపిస్తుంది. 

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్

మూత్రమార్గంలో వచ్చే ఇన్ఫెక్షన్‌ను ‘యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్’ (యూటీఐ) అంటారు. ఈ సమస్య ఎలా వస్తుందంటే శరీరం తనలోని వ్యర్థాలను శుభ్రపరిచాక వాటిని మూత్రం రూపంలో ఓ కండర నిర్మితమైన బెలూన్ లాంటి బ్లాడర్‌లో నిల్వ ఉంచుతుంది. ఈ బ్లాడర్ చివర స్పింక్టర్ అనే కండరాలు ఎప్పుడు బడితే అప్పుడు మూత్ర స్రావం కాకుండా ఆపుతుంటాయి. చాలాసేపటి వరకు (దాదాపు నాలుగు గంటలకు పైబడి) ఆపుకుంటే అక్కడ చాలా పరిమాణంలో మూత్రం చాలాసేపు నిల్వ ఉండిపోతుంది.

ఇలా దీర్ఘకాలం పాటు నిల్వ ఉంటే బ్యాక్టీరియా వృద్ధిచెంది దాని కారణంగానే మూత్రంలో ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్లు మూత్రపిండాలకీ పాకవచ్చు. ఇది కాస్త ప్రమాదకరమైన పరిణామం. మొదటిసారి ఇన్ఫెక్షన్ రావడాన్ని ‘ప్రైమరీ ఇన్ఫెక్షన్’ అంటారు. అవే ఇన్ఫెక్షన్లు మళ్లీ మళ్లీ వస్తుంటే వాటిని రికరెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ అని అంటారు. కిడ్నీల్లో వచ్చే ఇన్ఫెక్షన్ ను పైలోనెఫ్రిటిస్ అంటారు. 

గర్భిణుల్లో యూరినరీ సమస్యలు

గర్భిణుల్లోనూ మూత్రంలో ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ. గర్భధారణ సమయంలో గర్భసంచి పెరుగుతున్నకొద్దీ.. అది మూత్రనాళాలపై ఒత్తిడి కలగజేస్తుంది. ఫలితంగా మూత్రపిండాలు వాచిపోతాయి. దాంతో మూత్రాశయంలో ఉండే ఇన్‌ఫెక్షన్ మూత్రపిండాలకూ చేరే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మూత్రంలో ఇన్‌ఫెక్షన్ రావడం వల్ల అబార్షన్ అయ్యే ప్రమాదమూ ఉంటుంది. కొందరిలో నెలలు నిండకముందే ప్రసవం కూడా కావచ్చు. అందువల్ల గర్భిణులు మూత్రపరీక్ష చేయించుకుని, ఇన్‌ఫెక్షన్ ఉంటే మందులు తప్పకుండా వాడాల్సి ఉంటుంది.

నిర్ధారణ.. చికిత్స 

సాధారణ మూత్ర సమస్యలకు పెద్దగా పరీక్షలేమీ అవసరం ఉండవు. కానీ సమస్య పదే పదే వస్తుంటే మాత్రం అందుకు కారణాలు నిర్ధారణ చేసుకోవడం కోసం కొన్ని పరీక్షలూ చేయిస్తుంటారు. సీయూఈ, యూరిన్ కల్చర్, అల్ట్రాసౌండ్ స్కానింగ్, సీటీ, ఎంఆర్‌ఐ, ఎక్స్-రే (ఐవీయూ, ఎంజీయూజీ లాంటివి), సిస్టోస్కోప్ (యూటీఐ). అవసరాన్ని బట్టి కొన్ని రక్తపరీక్షలు అవసరమవుతాయి. సాధారణంగా వచ్చే ఇన్‌ఫెక్షన్‌కు మూడు రోజులపాటు యాంటీబయాటిక్స్ కోర్సు సరిపోతుంది.

మూత్రపిండాలలో ఇన్‌ఫెక్షన్ వచ్చినట్లయితే పది నుంచి పదిహేను రోజుల వరకు యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. కొందరిలో తరచూ ఇన్‌ఫెక్షన్లు వస్తున్నట్లయితే.. దీర్ఘకాలంపాటు చికిత్స అవసరమవుతుంది. ఇందులో చాలా తక్కువ మోతాదులో దీర్ఘకాలంపాటు యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. సమస్య ముదిరితే ఆసుపత్రిలో అడ్మిట్ చేసి,  సమస్యకు అనుగుణంగా చికిత్స ఇస్తుంటారు.

లక్షణాలు

తరచుగా మూత్ర విసర్జన చేయాలనిపించడం. మూత్ర విసర్జన సమయంలో మంట, తీవ్రమైన నొప్పి రావడం. నురగ, దుర్వాసనతో కూడిన మూత్రం రావడం, మూత్రంలో రక్తం పడటం, మూత్రాశయం నిండుగా ఉన్న అనుభూతి కలగడం. అసంకల్పితంగా మూత్రం బయటకు పోవడం, వెన్నుముక లేదా పొత్తి కడుపు క్రింద భాగంలో నొప్పి లేదా ఒత్తిడి కలగడం. కిడ్నీ సంబంధిత లక్షణాలు, జ్వరం, వికారం, వాంతులు, చలితో వణుకు రావడం వంటి లక్షణాలు కూడా మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ లకు సంకేతంగా చెప్పవచ్చు.

లక్షణాలు

వ్యక్తిగత శుభ్రత పాటించకపోవడం, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, నీళ్లు తక్కువగా తాగడం, అసురక్షిత లైంగిక చర్యలో పాల్గొనడం, కెఫిన్, కార్బోనేటేడ్ డ్రింక్స్, కాఫీ ఎక్కువగా తీసుకోవడం, ఎక్కువ సేపు మూత్ర విసర్జనను చేయకుండా ఆపుకోవడం, లో దుస్తులు మార్చుకోకపోవడం, కిడ్నీల నుంచి మూత్రం వచ్చేదారిలో రాళ్ల వంటి అడ్డంకులు ఏర్పడటం, టాయిలెట్‌కు వెళ్లిన ప్రతి సారి లైంగిక అవయవాలను శుభ్రం చేసుకోకపోవడం.

 డా లలిత కె 

(సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, 

యూరోగైనకాలజిస్ట్, 

రెనోవా సెంచరీ హాస్పిటల్స్, 

బంజారాహిల్స్, హైదరాబాద్)