వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేసింది
- కొత్త వర్షన్ రైలును ప్రవేశపెట్టిన రైల్వే శాఖ
- 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన రైలు
- బెంగళూరులో కోచ్‌ల తయారీ
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): అత్యంత అధునాతన వందే భారత్ భారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు సోమవారం దక్షిణ మధ్య రైల్వే అధికారులు కొత్త రైలు ప్రత్యేకతలను వెల్లడించారు. రైల్వే వ్యవస్థ లో దేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెడు తూ వందే భారత్ స్లీపర్ తన ప్రత్యేకతను చాటుతోంది. దేశంలో రైల్వే రంగంలో ఈ కొత్త రైలు విప్లవాత్మక మార్పు తీసుకురానుందని అధికారులు పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికత, ఆయా సౌకర్యాలతో కూడిన ఆకర్షణీయమైన రైలు ప్రయాణాన్ని ఈ సరికొత్త స్లీపర్ ట్రెయిన్ అందిస్తుంది.
దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ స్లీపర్ రైలు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. రైలు గరిష్ఠ వేగం 180 కిలోమీటర్లని అధికారులు వెల్లడించారు. ఆదివారం బెంగళూరులోని బీఈఎంఎల్ (భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్) ప్లాంట్‌లో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, సహాయ మంత్రి సోమన్న స్లీపర్ రైలును ఆవిష్కరించారు. దశలవారీగా ఈ రైళ్లను ప్రవేశపెట్టేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. దక్షిణ మధ్య రైల్వేకు సైతం ఒక రైలు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
వందేభారత్ స్లీపర్ ప్రత్యేకతలు
- ఆస్టెనిటిక్ స్టెయిన్‌లెస్ స్టీల్‌తో ఈ రైలును రూపొందించారు. ప్రయాణికుల భద్రత కోసం క్రాష్-వర్తీ ఫీచర్స్‌ను వాడారు. అగ్ని ప్రమాద భద్రతా ప్రమాణాలకు అనుగుణంగానూ తీర్చిదిద్దారు.
- ఈ రైలును ఏరోడైనమిక్ బాహ్య ఆకృతితో, ఉత్తమ ఇంటీరియర్ జీఎఫ్‌ఆర్పీ ప్యానెళ్లతో తయారు చేశారు. మాడ్యూలర్ పాంట్రీ, సౌకర్యవంతమైన టాయిలెట్లను ఏర్పాటు చేశారు. ఇందులో డ్రైవింగ్ సిబ్బంది కోసం కూడా ప్రత్యేకంగా మరుగుదొడ్లున్నాయి. దివ్యాంగుల కోసం ప్రత్యేకమైన బెర్తులు, టాయిలెట్లు అందుబాటులో ఉన్నాయి.
- సెన్సార్ ఆధారిత ఇంటర్ కమ్యూనికేషన్ డోర్లు, ఆక్సిజన్ లెవెల్ మెయింటనెన్స్ సిస్టమ్, యూఎస్బీ ఛార్జింగ్ సౌకర్యం, విజువల్ ఇన్ఫర్మేషన్ ఇంటిగ్రేటెడ్ రీడింగ్ లైట్, డిస్‌ప్లే ప్యానెల్స్, సీసీ కెమెరాలు, మాడ్యూలార్ పాంట్రీ, అగ్ని నిరోధక తలుపులు, ఆటోమేటిక్ డోర్స్ లాక్ సౌకర్యం వంటి అధునాతన సదుపాయాలున్నాయి. ఫస్ట్ క్లాస్ ఏసీ విభాగంలో వేడి నీటి కోసం షవర్లను ఏర్పాటు చేశారు.
- ఈ రైలులో 823 మంది ప్రయాణించవచ్చు. రైలులో మొత్తం 16 బోగీలున్నా యి. 11 ఏసీ 3 టైర్ బోగీలు ఉండగా.. అందులో 611 బెర్త్‌లు.. నాలుగు ఏసీ 2 టైర్ బోగీలుండగా.. అందులో 188 బెర్త్‌లు, ఒక ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీలో 24 బెర్త్‌లున్నాయి.






