వీబీజీ రామ్ జీ చట్టాన్ని ఉపసంహరించాలి
- ఉన్నతస్థాయి సమావేశంలో మంత్రి సీతక్క
- కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు వినతి
హైదరాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్)ను హక్కు ఆధారిత కార్యక్రమంగానే కొనసాగించాలని, వీబీజీ రామ్ జీ చట్టాన్ని ఉపసంహ రించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు, ఉన్నతాధికారుల సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి సీతక్క పాల్గొన్నారు.
సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వీబీజీ రామ్ జీ చట్టం అమలుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాలను సీతక్క వివరించారు. అనంతరం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు రాష్ట్ర ప్రభుత్వ తరఫున వినతిపత్రాన్ని అందజేశారు. సమావేశం అనం తరం మీడియాతో సీతక్క మాట్లాడుతూ... కొత్త చట్టంలో రాష్ట్రాలపై అధిక ఆర్థిక భారం మోపే నిబంధనలు ఉన్నాయని, వాటిపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన అభ్యంతరాలు వ్యక్తం చేసిందన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే రెండుసార్లు సమావేశమై అన్ని అంశాలను సమ గ్రంగా పరిశీలించిందన్నారు. సబ్ కమిటీ నివేదిక ఆధారంగా జూలై 2న జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కొత్త చట్టంలో చేరాలా, వద్దా అనే అంశంపై జూలై 2న తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తాం అన్నారు.






