పార్టీ పెద్దల సూచన మేరకే వెలిచాల నామినేషన్
l త్వరలో ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తాం..
l ప్రచారానికి సీఎం రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ అగ్రనేతలు వస్తారు..
l రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్, ఏప్రిల్ 23 (విజయ క్రాంతి): కాంగ్రెస్ పెద్దల సూచన మేరకే ఎంపీ అభ్యర్థిగా వెలిచాల రామ్‌చందర్‌రావుతో నామినేషన్ వేయించామని, ఈ మేరకు రేపో మాపో పార్టీ నుంచి అధికారిక ప్రకటన వస్తుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్‌లోని ఇందిరాభవన్‌లో మంగళవారం మానకొండూరు, చొప్పదండి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావుతో కలిసి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ టీం బలంగా ఉందని, తామంతా ఒక్కటన్నారు.
తన వెంట ఎవరెవరు నడిచివస్తున్నారో బండి సంజయ్ చెప్పాలని, బీజేపీ పెద్దలు విద్యాసాగర్‌రావు, మురళీధర్‌రావు, సుగుణాకర్‌రావు ఎక్కడున్నారో, ఎవరికి మద్దతు ఇస్తున్నారో చెప్పాలని మంత్రి ప్రశ్నించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అన్ని వర్గాలకు సమన్యాయం చేసిందన్నారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు మేలు చేసేందుకు కుల గణన చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసిదని, కానీ బీజేపీ ప్రభుత్వం మాత్రం కుల గణనను అడ్డుకుంటున్నదన్నారు. తాను తార్నాకలో ఎంఏ తార్నాకలో పొలిటికల్ సైన్స్ చదివానని, బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ పదోతరగతి ఎక్కడ చదివారో చెప్పాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ అభ్యర్థి వెలిచాల రామ్‌చందర్‌రావు విద్యావంతుడు అని, ప్రజలు ఎన్నికల్లో ఆయనకు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.
త్వరలో షెడ్యూల్ వేసుకుని కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తామన్నారు. బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమాలకు సీఎం రేవంత్‌రెడ్డితోపాటు ఏఐసీసీ అగ్రనేతలు సైతం హాజరవుతారన్నారు. ‘బీజేపీ నేతలు టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నారు. మా టీం ఇండియా కూటమి.. మా లీడర్ రాహుల్‌గాంధీ.. మేం 20 ఆడుతాం. ఎన్నికల మైదానంలో తిరగులేని విజయం సాధిస్తామ’ని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు ఆరేపల్లి మోహన్, కోడూరు సత్యనారాయణ గౌడ్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.






