19-08-2024 12:00:00 AM
ఏ వన్నెలు లేని దుసరి తీగలా ఆకుపచ్చ మనసు కొడవలి చెలిగినట్లే యాపాకు చేదులా మాటలు ఎండిఎండి తడిసితడిసి వొణికివొణికి మామిడి చెట్టులా నీడనిచ్చె నిట్టాడై నిలబడే నాన్న! వానొచ్చిన గాలొచ్చిన వాకిట్ల తాడుమంచమే నిద్ర దగ్గు దగ్గినప్పుడల్లా తెల్లారిందని దుప్పటి తీసి చూసేది మీకింకా తెల్లార లేదాని ఒంటిరెక్క తలుపు తట్టంగనే ఉలిక్కిపడి సపారంలో దిగ్గున కళ్లు నలిచేది నీకు నిద్ర రాకపోతే పిల్లలకు కూడ రావొద్దాని అమ్మ కోపం నేనెన్నడు చూసినా సూర్యుడుకన్న ముందే నాన్ననే మెల్కోంటడు! ప్రతి పండుగకు కొత్త అంగైతడు చినిగిన బనీనుతోనే చిరునవ్వు నాన్నా! నీకేది కొత్త అంగి అంటే రంజాన్ మామ ఇంకా కుట్టలేదంటడు
చేతిలో పైసలు లేకున్నా ఊరిల ఎవరన్న యాటకోస్తే మొదటి కుప్ప నాన్నదే పెద్దోడా అనే పిలుపు నాయినెప్పుడు పిలిచినా తెనేలొలికేది బనీను కీసల నుంచి పావులో ఆటానో చేతుల పెట్టేది కనపడని దేవుడికీ రోజూ దండం పెట్టినా కనిపించే దేవుడిలా నాయిన ఎదురుగ్గున్నా నమస్కరించలే నాన్న విలువ నేను నాయినను అయినప్పుడు తెలిసింది! మంగలి అసిపే భుజాన్నేసి ఇల్లిల్లు క్షౌరాలు ఎనబై దాటినా చేతుల కత్తెర కిందికి దించలే బాలయ్య సవురం చేస్తేనే ఊరిల మనసు కుదిరేది నూరు రాయితోపాటు బతుకు అరిగిపోయి నిలువ నీడ లేకపోయినా సెలుక ఆ దెరువు లేకపోయినా పేదరికంపై ఎన్నడు ఆలోచించని గొప్ప ధైర్యం ఎడతెగని కష్టజీవి నాయిన!
పలుకలేని స్థితిలో నాయిన ఆలతు చూసి నా శక్తి ఉడిగిపాయే ఎందుకురా ఏడుస్తావ్ నాకేం కాలేదని అన్నడు నా చేతిమీద చెయ్యేసి చిన్నగా దువ్వినప్పుడు ఎంత ఎచ్చని స్పర్శనో... నాన్న అనే పిలుపు ఇక మాసి పోతదేమోనని ఒక్కసారి ఆగిపోయిన నా గుండె చెదిరిపోయిన మనసు రెక్కలు తెగిన దుఃఖం అయ్యా! నువు చెప్పిన ప్రతి బుద్ధిమాటకు దండం పెడుతున్నా మముగన్నందుకే గాదు బతుకుబండై నడిపిచ్చిన నీ చేతులకు నమస్కరిస్తున్నా నాన్న గుండె నా గుండెలోకి ఒంపితే వచ్చిన నాన్న గుండె శబ్దం ఇది!
(నాన్న అనారోగ్యంతో
మంచం మీదున్నప్పుడు బాధతో..)