భాగస్వామ్యంగా చూడండి
- సీఎస్‌ఆర్ నిధుల ఖర్చు వంద శాతం సత్ఫలితాలు వచ్చేలా చూడాలి
- ప్రాధాన్యరంగాలను మీరే ఎంచుకోండి
- అవసరమైన సహకారం మేం అందిస్తాం
- కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): సమాజాభివృద్ధికి చేసేది ఖర్చుగా కాకుండా భాగస్వామ్యంగా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎస్‌ఆర్ నిధులపై వివిధ కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులతో రేవంత్‌రెడ్డి బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంపెనీలు సీఎస్‌ఆర్‌కు చేస్తున్న వ్యయం వందకు వంద శాతం సత్ఫలితాలు ఇచ్చేలా ఉండాలన్నారు.
తమ ప్రభుత్వం విద్య, వైద్యం, జలవనరుల సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తుందని తెలియజేశారు. కంపెనీలు వీటితోపాటు తమకు ఇష్టమైన ఏ రంగాన్నైనా ఎంచుకొని సీఎస్‌ఆర్ నిధులు వినియోగించాలని సూచించారు. ప్రభుత్వంతోపాటు కంపెనీలు కలిపి చేసే వ్యయంతో తెలంగాణ విద్యార్థులను ప్రపంచస్థాయి నైపుణ్యం ఉన్నవారిగా తీర్చిదిద్ది భవిష్యత్ అవకాశాలను వారు అందిపుచ్చుకునేలా తయారు చేయగలమని అన్నారు.
విద్యపై పెట్టే వ్యయాన్ని తాము భవిష్యత్‌తరాలపై పెట్టే పెట్టుబడిగా భావిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని విద్యార్థుల సంఖ్యలో హైదరాబాద్‌లోనే 44 శాతం ఉన్నారని, వారికి నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. కంపెనీలు స్థానికంగా ఉన్న అన్ని మౌలిక వసతులను వినియోగించుకుంటున్నందున తమ సీఎస్‌ఆర్ నిధుల్లో ఎక్కువ మొత్తాన్ని అదే ప్రాంత అభివృద్ధికి కేటాయించాలని చెప్పారు.
ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని నియమించాం..
సీఎస్‌ఆర్ నిధుల వినియోగంలో ఇప్పటివరకు సరైన విధానం లేనందున తాము ఒక ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఇందుకు నియమించామని ముఖ్యమంత్రి తెలిపారు. కంపెనీల ప్రతినిధులు ఆయనతో సమన్వయం చేసుకొని తమకు ఆసక్తి ఉన్న విద్య, వైద్యం, జలవనరులు, నైపుణ్య శిక్షణ, వారసత్వ కట్టడాల పరిరక్షణ, అడవుల సంరక్షణ ఇలా దేనికైనా ఆ నిధులు వినియోగించవచ్చని సూచించారు.
ఇప్పటికే రహేజా గ్రూప్ రూ.50 కోట్లు, రాంకీ గ్రూప్ రూ.50 కోట్లు, యశోద ఫౌండేషన్ రూ.10 కోట్లు విద్యాభివృద్ధికి కేటాయించేందుకు ముందుకు వచ్చాయని, వారికి సీఎం అభినందనలు తెలిపారు. కంపెనీల ప్రతినిధులు స్పందిస్తూ సీఎస్‌ఆర్ నిధుల విషయంలో ఇప్పటివరకు ఇలా ఎవరూ తమను సంప్రదించలేదని పేర్కొన్నారు. ఈ విషయంలో చొరవ తీసుకున్నందుకు రేవంత్‌రెడ్డికి కంపెనీ ప్రతినిధులు అభినందనలు తెలిపారు. పాఠశాల విద్య, ఆసుపత్రులు, వారసత్వ కట్టడాల పరిరక్షణకు వారు ఆసక్తి చూపారు.
సమావేశంలో రహేజా ఫౌండేషన్ నుంచి శ్రావణ్‌కుమార్, రాంకీ ఫౌండేషన్ నుంచి దాక్షయణి ఆళ్ల, యశోద ఆసుపత్రి నుంచి డాక్టర్ గోరుకంటి సురేందర్‌రావు, గోరుకంటి ఫల్గుణ్‌రావు, మేఘా నుంచి సుధారెడ్డి, అపోలో ఆసుపత్రి నుంచి అపర్ణారెడ్డి, కామినేని భాస్కర్‌రెడ్డి, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుంచి శేఖర్‌రెడ్డి, నాదం ఫౌండేషన్ నుంచి పగిడిపాటి దేవయ్య, రుద్రమదేవి, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి వెంకటేష్ ధోత్రే, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ పాల్గొన్నారు.




