జోరుగా కాంగ్రెస్ ప్రచారం
l సీఎం రేవంత్‌రెడ్డి సుడిగాలి పర్యటనలు
l రోజుకు రెండు, మూడు సభలకు హాజరు
l ఇంటింటి ప్రచారానికి అభ్యర్థుల కార్యాచరణ
l ఎన్నికలను టాస్క్‌గా తీసుకున్న మంత్రులు
l గ్రామాలు, పట్టణాల్లో కరపత్రాలు, బ్రోచర్ల పంపిణీ
హైదరాబాద్, ఏప్రిల్ 2౪( విజయక్రాంతి ): లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరం చేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి జోరుమీదున్న కాంగ్రెస్, సార్వత్రిక ఎన్నికల్లోనూ సత్తా చాటాలని చూస్తోంది. ఇప్పటికే నామినేషన్లు వేసిన అభ్యర్థులు ప్రచారంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని, విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.
రోజుకు రెండు, మూడు సభలకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరువుతూ.. పార్టీ క్యాడర్‌లో జోష్ పెంచుతున్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలపై ప్రశ్నల వర్షం కురిపిస్తూనే.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేసే ఆరు గ్యారెంటీలు, సంక్షేమ పథకాలతో పాటు ఏఐసీసీ విడుదల చేసిన ఐదు గ్యారెంటీలను ప్రజల వద్దకు చేరేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. కరపత్రాలు, బ్రోచర్ల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేసేందుకు సమాయత్తమవుతున్నారు. నియోజక వర్గాల్లోని పార్టీ సమన్వయకర్తల నేతృత్వంలో వీటిని పోలింగ్ బూత్ స్థాయి నుంచి ఇంటింటికీ అందేలా చూడాలని పీసీసీ నిర్ణయించింది.
నియోజకవర్గాల్లోనే మంత్రుల తిష్ట..
పార్లమెంట్ నియోజకవర్గాలకు ఎన్నికల ఇన్‌చార్జ్‌లుగా ఉన్న మంత్రులు అక్కడే తిష్ట వేసి అభ్యర్థులతో కలిసి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక పార్టీ ఎంపీ అభ్యర్థులు కూడా తమ వ్యూహాలకు పదునుపెడుతూ ప్రత్యర్థులపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్ ప్రజలకు చేసిందేమి లేదని అభ్యర్థులు జనంలోకి వెళుతున్నారు. ప్రజలను కలుస్తూ ఓటు వేసి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో బీజేపీతోనే ఎక్కువ నియోజకవర్గాల్లో పోటీ ఉంటుందని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. కమలం పార్టీ టార్గెట్‌గా రాజకీయం చేయాలని చూస్తున్నారు. బీజేపీ దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తూ ఎన్నికల్లో లబ్ధి పొందాలని ప్రయత్నిస్తోందని, విభజించు పాలించు అనే విధానాలను అవలంబిస్తోందని విమర్శలు చేస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ధరలు అకాశాన్నంటున్నాయని, రాష్ట్రానికి రావాల్సిన నిధులు కూడా సక్రమంగా ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు.
రైతుల ఓట్లపై ప్రధాన గురి..
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఐదింటిని అమలు చేశామని, మిగతా వాటిని పార్లమెంట్ ఎన్నికల ముగిసిన తర్వాత ఆచరణలోకి తెస్తామని రేవంత్‌రెడ్డి ప్రతి బహిరంగ సభలో వివరించే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం హాజరయ్యే ప్రాంతాల్లో ఏ దేవాలయాలు, మసీద్, చర్చిలు ఉంటే వాటిపై ఒట్టేసి చెబుతున్నారు. వీటిలో ప్రధానంగా రూ.2 లక్షల రైతు రుణమాఫీ, వరిపంటకు క్వింటాకు రూ.500 బోనస్‌తో పాటు ప్రతి పేదవాడికి తెల్లరేషన్ కార్డు, ఇతర అంశాలను అమలు చేస్తామని ప్రజలకు వివరిస్తున్నారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వనున్నట్లు చెబుతున్నారు.






