రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి
* రహదారులపై ధాన్యం ఆరబోసి ప్రమాదాలకు కారణమయ్యే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవు
* రైతులు ప్రభుత్వం సూచించిన నిర్దిష్ట కల్లాల్లోనే ధాన్యం ఆరబోసుకోవాలి
కల్హేర్(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండల పరిధిలోని మాసన్ పల్లి NH4 పై రైతులతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, DSP వెంకట్ రెడ్డి మాట్లాడుతూ... కొంతమంది రైతులు, వ్యాపారులు రహదారులపై ధాన్యం ఆరబోస్తుండటంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా రాత్రి సమయంలో రోడ్లపై ఆరబోసిన ధాన్యం సరిగా కనిపించక వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు.
రోడ్లపై ధాన్యం ఆరబోయడం వలన వాహనాల రాకపోకలకు అంతరాయం కలగడమే కాకుండా, ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుందని అన్నారు. ఈ నేపథ్యంలో రహదారులపై ధాన్యం ఆరబోసి రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు తమ ధాన్యాన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసిన నిర్దిష్ట కల్లాల్లో (లేదా) వ్యవసాయ శాఖ సూచించిన ప్రదేశాల్లోనే ఆరబోసుకోవాలని సూచించారు. ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని డిఎస్పీ కోరారు. బాచేపలి ,మాసన్పల్లి గ్రామలల్లోని రైతులకు అవగాహన కల్పించారు. అయన వెంట సీఐ వెంకట్ రెడ్డి, ఎస్ఐ రవి గౌడ్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.






