28-09-2025 02:33:17 PM
చెన్నై: శనివారం తమిళనాడులోని కరూర్‌లో తమిళగ వెట్రీ కజగం(Tamilaga Vettri Kazhagam) అధినేత విజయ్ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ తొక్కిసలాటపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ విజయ్ మద్రాస్ హైకోర్టు(Madras High Court)ను ఆశ్రయించారు. తొక్కిసలాటపై స్వయంగా విచారణ కోరుతూ హైకోర్టు అత్యవసర విచారణకు అనుమతించింది. పూజ సెలవుల కారణంగా కోర్టు వారం రోజులు మూసివేయబడినప్పటికీ ఈ అత్యవసర పిటిషన్‌ను న్యాయమూర్తి అంగీకరిస్తూ సోమవారం కేసు విచారణకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.
ర్యాలీ జరుగుతుండగా రాళ్లు రువ్వడంతో పాటు పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో గందరగోళ పరిస్థితులు నెలకున్నట్లు టీవీకే పిటిషన్ లో పేర్కొంది.ఈ సంఘటనకు సంబంధించి టీవీకే 'కుట్ర కోణం' జరిగిందని, స్వతంత్ర సంస్థ ద్వారా పార్టీ మద్రాస్ హైకోర్టును సుమోటోగా దర్యాప్తు కోరుతున్నట్లు తెలుస్తోంది. రిటైర్డ్ జడ్జి అరుణా జగదీశన్ నేతృత్వంలోని కమిషన్ ఆదివారం మధ్యాహ్నం కరూర్‌కు చేరుకుంటుందని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చెప్పిన తర్వాత ఇది జరిగింది.
ఆగస్టులో ర్యాలీలు నిర్వహించడానికి అధికారులను అనుమతించేందుకు ఆదేశించాలని టీవీకే పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. అప్పట్లో ఈ తొక్కిసలాట వంటి అవాంఛనీయ సంఘటన జరిగితే జవాబుదారీతనంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. విజయ్ తన సమావేశాలు చట్టబద్ధంగా జరిగేలా చూసుకోవాలని, గర్భిణీ స్త్రీలు, వికలాంగులు ర్యాలీలకు హాజరు కావద్దని కోరడం ద్వారా ఇతరులకు ఒక ఉదాహరణగా ఉండాలని కోర్టు మౌఖికంగా వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
ఆరోగ్య కార్యదర్శి పి.సెంథిల్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. మొత్తం 95 మంది ఆసుపత్రిలో చేరారని, 51 మంది ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో, మిగిలిన 44 మంది ప్రైవేట్ ఆసుపత్రులలో చేరారు. 39 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా ఆయన స్పష్టం చేశారు. విజయ్ మరియు టీవీకే పార్టీ మృతుల కుటుంబానికి రూ.20 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.