28-09-2025 01:44:17 AM
1908, సెప్టెంబర్ 28న హైదరాబాద్‌ను ముంచెత్తిన వరద
నాటి ఘోర విపత్తులో 15 వేల మంది మృతి
హైదరాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): అది 1908 సెప్టెంబర్ 28 అర్ధరా త్రి.. పొద్దంతా పనుల్లో నిమగ్నమై.. రాత్రికి ఇంటికి చేరిన ప్రజలు గాఢనిద్రలో ఉన్నారు. ఒక్కసారి వారి జీవితాలపై మూసీ విరుచుకుపడింది. జలప్రళయాన్ని సృష్టించి అభాగ్యుల ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన జరిగే నేటికి 117 ఏండ్లు గతించింది. మళ్లీ భాగ్యనగరంలో కుండపోత వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మూసీ పరీవాహక ప్రాంతంలో అనేక అక్రమ కట్టడాలు వెలయడంతో నీటి ప్రవాహానికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వరద నీటి ఉదృతిని కట్టడి చేసేందుకు నిర్మించిన జంట జలాశయాల నుంచి నీటిని విడుదల చేస్తే, పరీవాహక ప్రాంతాలన్నీ అతలాకుతలమవుతున్నాయి.
రోడ్లు కాల్వలను తలపిస్తుండగా. వరద నీటితో పలు కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. ఇండ్లు, అపార్ట్‌మెం ట్లు తేడా లేకుండా నీళ్లు చొచ్చుకొని వస్తున్నాయి. జన జీవనం స్తంభించిపోయింది. దీంతో సరిగ్గా ఇదేరోజు అంటే 1908, సెప్టెంబర్ 28న చోటుచేసుకున్న జల ప్రళయం ఘటన భాగ్యనగర్ వాసుల గుండెల్లో గుబులు పుట్టుస్తోంది.
అప్పుడేం జరిగిందంటే..
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల హైదరాబాద్‌లో వర్షాలు కురి శాయి. 1908లో సెప్టెంబర్ 26, 27 తేదీల్లో పడిన భారీ వానలతో మొదట పాలమాకుల చెరువు గట్టు తెగింది. ఆ వరద కత్వ చెరువును చేరింది. ఆ చెరువు కూడా వరద తాకిడికి తట్టుకోలేకపోయింది. గొలుసుకట్టులోని మరోనాలుగైదు చెరువులు కూడా గట్లు తెగాయి. నీళ్లు చందనవఖి డ్యామ్‌ను చేరాయి. డ్యామ్ తెగి నీళ్లు ఫిరంగి నాలాను ముంచెత్తాయి. ఫిరంగి నాలా నుంచి ఈసా నదిని చేరాయి.
ఈసా నది ఉప్పొంగి మూసీ ని చేరింది. మూసీ ఉగ్రరూపం దాల్చి హైదరాబాద్ చరిత్రలో తీవ్ర విషాదాన్ని మిగిల్చిం ది. 1908 సెప్టెంబర్ 27న ఉదయం 11 గం టలకు మూసీ నది నీటి మట్టం గరిష్ఠ స్థాయికి చేరింది. అంతకు రెండు రోజుల కింద చిన్నచిన్న చినుకులుగా మొదలైన వర్షం.. మహోగ్రరూపం దాల్చిం ది. 1908 సెప్టెంబర్ 28 రాత్రి 15.38 సెంటిమీటర్లుగా కురిసిన వర్షానికి భాగ్యనగరం అతలాకుతలమైంది.
పరీవాహక ప్రాంతంలోని చెరు వులన్నీ నీటితో నిండిపోయాయి. శంషాబాద్ ఏరియాలో ఒక్కరోజే 12.05 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. మూసీనది రెండు ఒడ్డుల మధ్య దూరం 700 అడుగులే అయి నా, వరదల సమయంలో కిలోమీటర్‌కు మించి ప్రవహించింది. మూసీ నీళ్లు ఏరులై పారి సెప్టెంబర్ 28న అర్ధరాత్రి జల విల యం సృష్టించాయి. ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్ ఉన్న ప్రాంతంలో ఆనాడు 200 మంది గల్లంతయ్యారు.
ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీసిన కొందరు రాజభవ నాల్లో తలదాచుకున్నారు. మూసీ నది వరదలు మనుషుల ప్రాణాలు, ఆస్తులతో పాటు చారిత్రాత్మక ప్రాధాన్యం కలిగిన తెలంగాణ వారసత్వ సంపదను దెబ్బతీశాయి. భారీగా వరద నీరు చేరి లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. వరదల్లో చిక్కుకొని వేలాది మంది జలసమాధి అయ్యారు. గోడలు, చెట్టు ఎక్కినా తప్పించుకోలేకపోయారు. అప్పుడు కేవలం 48 గంటల్లోనే 15 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
36 గంటల వ్యవధిలోనే 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగరంలో ఉన్న మూడు వంతెనలు (అప్జల్, ముస్సాలం జంగ్, చాదర్ ఘాట్) తెగిపోవడంతో.. పురానాఫూల్ వంతెన మాత్రమే నగరంలోని రెండు ప్రాతా ల మధ్య అనుధానమై ఉంది. సెప్టెంబర్ 28న మూసీనది 60 అడుగుల ఎత్తులో ప్రవహించడంతో ఆఫ్జల్‌గంజ్ వద్ద నీటి మట్టం 11 అడుగులకు చేరింది. వర్షం నీరు చాదర్‌ఘాట్ దాటి అంబర్‌పేట్ బురుజు వరకు, అటు చార్మినార్ దాటి శాలిబండ వరకు ప్రవహించాయి.
వందల సంఖ్యలో జనం పేట్లబురుజుపైకి ఎక్కారు. కానీ రెండు గంటల్లోనే పేట్లబురుజు నీటి ప్రవాహానికి కొట్టుకోపోవడంతో వందల మంది ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఆ రోజు సా యంత్రానికి గానీ వరద ఉధృతి తగ్గలేదు. అప్పటి ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ నిరాశ్రయుల కోసం అనేక సహాయక చర్యలు ప్రారంభించి, తమ సంస్థానాల్లోని భవనాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించా డు. అనేక వైద్య, అన్నదాన శిబిరాలు ప్రారంభించారు.
దాదాపు 2 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అనధికారికంగా మృ తుల సంఖ్య ఎక్కువే ఉండొచ్చు. అప్పట్లో హైదరాబాద్ జనాభా దాదాపు 5 లక్షలు. ఆ ప్రకారం చూస్తే, ఆనాటి మూసీ వరదలు నగరంలోని దాదాపు సగం జనాభాను నిరాశ్రయులను చేశాయి. కోల్సావాడి ప్రాంతం మొత్తం ఓ ద్వీపంలా మారి తర్వాత కొట్టుకుపోయింది. హుస్సేనీ ఆలం, షమీ గంజ్, భద్రి అలావా, ఝాన్సీమీయా బజార్, జామ్‌భాగ్, దారుల్‌షిఫా, గౌలిగూడ, అఫ్జల్‌గంజ్, బేగం బజార్ ఇలా అనేక ప్రాంతాలు నీట మునిగాయి. బ్రిటిష్ రెసిడెన్సీ ఆర్చ్ కూడా సగం వరకు మునిగింది.
ప్రస్తుతం దీన్ని కోఠి ఉమెన్స్ కాలేజీ (చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీగా) గా పిలుస్తున్నా రు. ప్రజలను కాపాడేందుకు వెళ్లిన దాదాపు 90 సైనికులు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ తన రూపం కోల్పోయింది. ప్రకృతి ప్రకోపం వల్లే ఇలా జరిగిందని పూ జారులు చెప్పడంతో.. ముస్లీం రాజైనప్పటికీ మహబూబ్ అలీఖాన్ మూసీనది వద్దకు చేరుకొని గంగమ్మకు పూజలు చేశారు. సారెను సమర్పించారు.
ముత్యాలతో నిండి న బంగారు ఆభరణాలను గంగమ్మకు కానుకగా ఇచ్చారని చెబుతారు. తమ ప్రాంతాన్ని, కాపాడాలని, వెనక్కి తగ్గాలని కోరారని ప్రతీ తి. సెప్టెంబర్ 29 సాయంత్రానికి వరద ఉధృ తి తగ్గింది. అప్పుడు ఎక్కడ చూసినా శవాలే దర్శనమిచ్చాయి. ఇది కేవలం హైదరాబాద్‌కు సంబంధించిన లెక్కలే. ఇక రంగారెడ్డి, మేడ్చల్, శంషాబాద్, వికారాబాద్ లెక్కలు చూస్తే ఇంకా ఎక్కువే ఉం టాయని చరిత్రకారులు చెబుతారు.
మేకలు, కోళ్లు, పశువుల సంఖ్యకు లెక్కేలేదు. 788 చెరువులు తెగిపోయాయి. 860 చదరపు మైళ్ల విస్తీర్ణాన్ని వరద ప్రభావితం చేసింది. మూసీ ఉత్తరం వైపు రెండు కిలోమీటర్లు, దక్షిణం వైపు ఒక కిలోమీటర్ వరకు తుడిచిపెట్టేసింది. పురానాఫూల్ వంతెన ఈ విషాదానికి సాక్షిగా నిలిచింది. చనిపోయిన వేలాది మందితో మృత్యుఘోష వినిపిస్తే, బతుకి ఉన్న వారి ఆకలికేకలతో నగరమంతా విషాదగీతంగా మారింది. ఖజానా నుంచి ఆరో నిజాం 50 లక్షలు కేటాయించారు.
అప్పటి ప్రధాని కిషన్ పర్షాద్ లక్ష రూపాయల విరాళం ప్రకటించారు. కొందరు వ్యాపారులు స్వచ్ఛం దంగా విరాళాలు ప్రకటించారు. అప్పట్లోనే దాదాపు కోటి రూపాయలు విరాళంగా వచ్చాయి. చుట్టుపక్కల నుంచి ధాన్యం, కూరగాయలు వచ్చేవి. ఆరో రాజు మీర్ మహబూబ్ అలీఖాన్ నగరమంతా తిరిగి విషాద పరిస్థితిని కల్నారా చూసి కన్నీరు పెట్టుకున్నారు. ఆయా ప్రజల మత ఆచారాల ప్రకారం అంతిమ దహన సంస్కారాలు చేయించారు. ఈ ఘటన నైటింగల్ ఆఫ్ ఇండియాగా పేరొందిన సరోజిని నాయడు ‘టియర్స్ ఆఫ్ ఆసిఫ్’ పేరుతో ఓ హృదయ విదారక గేయాన్ని కూడా రాశారు.
150 మంది ప్రాణాలు కాపాడిన చింతచెట్టు
1908 నాటి వరదలు భాగ్యనగరాన్ని జలదిగ్భందం చేశాయి. వరదల సమయంలో మూసీనదికి ఉత్తరం వైపు ఉన్న ఓ ఉద్యానవనంలో ఓ భారీ చింతచెట్టుపైకి ఎక్కిన 150 మంది తమ ప్రాణాలను కాపాడుకున్నారు. అనంతర కాలంలో ఆ ప్రాంతంలో ఉస్మానియా హాస్పిటల్‌ను నిర్మించారు. అనంతర కాలంలో రోడ్డు విస్తరణ సమయంలో దారికి అడ్డంగా ఉందని ప్రభుత్వం ఈ చింత చెట్టును నరికేస్తానంటే అక్కడి ప్రజలు అడ్డుకున్నారు. ఇప్పటికీ ఈ చెట్టు ఉస్మానియా దవాఖాన పరిధిలో ఉంటుంది.
జంట జలాశాయాల నిర్మాణం..
భారీ వరదల అనంతరం అప్పటి ఆరో నిజాం మహబూబ్‌అలీఖాన్, ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మళ్లీ అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు పటిష్ట చర్యలు తీసుకున్నారు. ప్రజల పక్షాన నిలబడటంలో ప్రజాస్వామిక ప్రభుత్వాల కంటే కూలీన ప్రభుత్వాలే వరద బీభత్సానికి తీవ్రంగా చలించారు. 1908 మూసీ విలయం సంభవించిన రెండేండ్లకే హైదరాబాద్‌పై తీవ్రమైన ప్లేగు మహమ్మారి ముప్పేటా దాడి చేసింది.
తీవ్రమైన ప్రాణనష్టం జరిగింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ మూసీ వరదల తర్వాత ప్రళయాన్ని ఎదుర్కొనేందుకు అప్పటి నిజాం ప్రభువు మహబూబ్ అలీఖాన్ ప్రసిద్ధ ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను పిలిపించి నగరంలో ప్లానింగ్ బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్‌కు పశ్చిమ ప్రాంతంలో ఉన్న గండిపేట చెరువు వద్ద ఓ రిజర్వాయర్‌ను నిర్మించాలని భావిం చి 1913, మార్చి 24న పునాది వేశారు. 1920లో నిర్మా ణం పూర్తయ్యింది.
ఇదే ప్రస్తుత ఉస్మాన్‌సాగర్. దీనికి సమాంతరంగా 20 కిలోమీటర్ల దూరంలో మరో రిజర్వాయర్ నిర్మా ణం చేపట్టారు. 1927లో ఇది పూర్తయ్యింది. దీనికి ఉసా ్మన్ అలీఖాన్ కుమారుడు హిమాయత్ అలీఖాన్ పేరు మీదుగా హిమాయత్ సాగర్‌గా పేరుపెట్టారు. రెండు రిజర్వాయర్లను మూసీ వరదలను నియంత్రించ డానికి నిర్మించారు. హైదరాబాద్ నగర ప్రజలకు తాగునీరు అందించాలనే లక్ష్యంతోనూ ఈ బ్యారేజ్‌లు నిర్మించారు.
అలా హైదరాబాద్‌ను వరదల నుంచి కాపాడటానికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య పరిష్కార మార్గం చూపగా, నిజాం రాజ్యంలోని ఇంజినీర్లు మహ్మద్ హుస్సేన్, ఆయన కుమారుడు ఖాజా మొయినోద్దీన్ విశేషంగా కృషి చేశారు. హైదరాబాద్‌లోని చెరువుల్లో పూడికతీత తీయించారు. ఇప్పుడు భాగ్యనగర జనాభా కోటి దాటింది.
అప్పటి వరద ఉధృతిని నివారించేందుకు నిర్మించిన జంట జలాశయాల నుంచి నీటిని విడుదల చేస్తేనే భాగ్యనగరం అతలాకుత లమవుతుంది. భూకబ్జాదారుల కారణంగా కుంచించుకోపోయిన మూసీ నది.. నగర ప్రజలపై ప్రకోపం చూపిస్తోంది. 1908 నాటి పరిస్థితే మళ్లీ నెలకొంటే జరిగే నష్టం ఊహించుకోడానికే భయానకంగా ఉంటుంది.