28-09-2025 01:13:27 AM
-డాక్టర్లు, టీచర్లు, చిన్న పిల్లలకు సైతం..?
-ఇదీ మంచిర్యాల గీత పారిశ్రామిక సహకార సంఘం తీరు
మంచిర్యాల, సెప్టెంబర్ 27 (విజయక్రాం తి): ఏ సొసైటీలోనైనా నియమనిబంధనల మేరకు సభ్యత్వాలు ఇవ్వడం, ఏదైనా సభ్యు డు అవినీతికి పాల్పడితే వారికి వార్నింగ్ మెమోలు ఇచ్చి, అయినా వారిలో మార్పు రాకపోతే సమావేశమై తప్పు చేసిన సభ్యుడిని తొలగించడంలాంటివి చేస్తుంటారు. కానీ మంచిర్యాలలోని రిజిస్టర్డ్ ప్రాథమిక కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘం తీరే వేరేలా ఉంది. ఈ సంఘంలో కన్వీనర్‌గా ప్రకటించుకున్న ఓ వ్యక్తి తనకు నచ్చిన వారిని సొసైటీలో సభ్యత్వం ఇవ్వడం, సొసైటీలో జరిగే అవినీతి, అక్రమాలపైన ఎవరైనా ఎదిరిస్తే అందరిని జమ చేసి సొసైటీకి వ్యతిరేకం గా పని చేస్తుండని, ఇతరత్రా కారణాలను చూపిస్తూ ఆ సభ్యుడిని తొలగించేందుకు ప్రయత్నాలు చేయడం ఈ సొసైటీలో పరిపాటిగా మారింది.
డాక్టర్లు, టీచర్లుకు సైతం సభ్యత్వం
కల్లుగీత సొసైటీలో మొదట్లో ఎవరికైనా సభ్యత్వం ఇవ్వాలంటే చెట్టు ఎక్కి, దిగుతా డా? అనే పరీక్ష పెట్టేవారు. ఎక్కి దిగితేనే సభ్యత్వం ఇచ్చేవారు. కానీ కన్వీనర్‌గా ప్రకటించుకున్న సదరు వ్యక్తి మంచిర్యాలలోని కొందరు డాక్టర్లను, చదువుకుంటున్న చిన్న వయస్సున్న విద్యార్థులకు సైతం సభ్యత్వం ఇచ్చి మొదటి నుంచి ఉన్న వారికి ఇచ్చే వాటాదనంలో కోత విధిస్తుండు. డాక్టర్‌గా వైద్య సేవలందిస్తున్న నీలకంఠేశ్వర్‌రావు, కుమార్, అబ్బూరి శ్రీనివాస్‌లే కాకుండా విద్యా సంస్థల అధినేత పూదరి చంద్రమోహన్‌గౌడ్ లాంటి ప్రముఖులను సైతం సొసైటీ లో చేర్చి వారికి ఏటేటా కల్లు డిపో నడిపే కాంట్రాక్టర్ ఇచ్చే డబ్బులను పంచుతున్నా డు.
వీరే కాకుండా స్థానికంగా ఉండని వారు, విదేశాలలో ఉండే వారు కూడా ఇందులో సభ్యులుగా చేర్చినట్లు సమాచారం. అధికారికంగా సంఘంలో కొంత మందే ఉన్నా అనధికారికంగా చాలా మంది పేర్లు సభ్యుల లిస్టులో చేర్చారు. వయస్సు నిండని వారిని సైతం సభ్యులుగా చేర్చారని కొందరు సభ్యు లు ఆరోపిస్తున్నారు. మంచిర్యాల ప్రాథమిక కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘం మొదట 39 మందితో ప్రారంభమై పలు పరీక్షల నిర్వహించిన అనంతరం మరి కొందరికి అవకాశం కల్పించి సభ్యుల సంఖ్యను 115 మందికి చేర్చినట్లు సమాచారం. డాక్టర్లు, విద్యా సంస్థల అధినేతలు, విద్యార్థులు, తదితరులను కలుపుకొని ప్రస్తుతం ఈ సంఘ సభ్యుల సంఖ్య 140కిపైగా చేర్చినట్లు తెలిసింది.
సొసైటీ లాభాల కోసమేనా?
మంచిర్యాల కల్లు గీతా పారిశ్రామిక సహకార సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో కల్లు అమ్ముకునేందుకు వేలంలో ఎక్కువ ధరకు ఎవరు పాడుకుంటే వారికే అవకాశం కల్పిస్తున్నారు. ఈ సొసైటీ తరపున వచ్చే లాభాలు సంఘంలోని సభ్యులందరికి పంచుతుంటారు. లీజుదారుడు ఏడాదిలో రెండుసార్లు ఇచ్చే డబ్బులను సభ్యులకు పంచుతుంటారు.
ఇది వరకు బాగానే ఉన్నా ఆర్థికంగా ఉన్న వారు, కుల వృత్తి కాకుండా ఇతర వృత్తులు చేసుకునే వారి వద్ద సంఘంలో సభ్యత్వం పేరుతో ఎంతో కొంత తీసుకొని కొంత మందితో కలిసి కన్వీనర్ సభ్యత్వం కల్పించాడని పలువురు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంఘం నుంచి వచ్చే ఐదారు వేలకు డాక్టర్లు, విద్యాసంస్థల అధినేతలు తదితరులు కల్లు అమ్ముకునేందుకు ఏర్పడ్డ సంఘంలో సభ్యత్వం తీసుకుంటారా? దీని వెనుక అసలు కథ ఏందీ? వీరంతా సభ్యులు అని లీజు డబ్బులు పంచారు, వారు ఆ డబ్బులు తీసుకున్నారా? వారి పేరిట ఇంకెవరైనా మింగారా? తదితర పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరుపాలని కోరుతున్నారు.