calender_icon.png 28 September, 2025 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి గడపకు కాంగ్రెస్ బాకీ కార్డు

28-09-2025 01:37:04 AM

ఎన్నికల హామీల అమలులో రాష్ట్రప్రభుత్వం విఫలం

  1. అన్నివర్గాలకూ కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడింది
  2. ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ బాకీ కార్డులు పంచుతాం
  3. స్థానిక ఎన్నికలు, ‘జూబ్లీహిల్స్’లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పండి
  4. ప్రజలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు

హైదరాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రె స్ నేతలు ఇంటింటికీ వెళ్లి గ్యారెంటీకార్డులు అందించారని, అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత హామీల సంగతే మరచిపోయారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. గ్యారెంట్‌కార్డులతో కాంగ్రెస్ నేతలు ఎలా మోసం చేశారో వివరించేందుకే బీఆర్‌ఎస్ ప్రతి గడపకూ వెళ్లి ప్రజల కు ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ అందజేస్తుందని స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో శనివారం ఆయన మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్‌రెడ్డి, మాజీ స్పీకర్ మధు సూదనాచారితో కలిసి ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. కాంగ్రె స్ చేసిన మోసాలే నేడు ప్రజల చేతిలో పాశుపతాస్త్రాలుగా మారాయని అభిప్రాయప డ్డారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

అధికారం కోసం అడ్డమైన హామీలి చ్చి, గద్దెనెక్కిన తర్వాత వాటిని గాలికొదిలేసిన ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ సమరశంఖం పూరించిందని ప్రకటించారు. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని నమ్మబలికి, 700 రోజులు దాటినా ప్రభుత్వం స్పందించడం లేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఏ వర్గానికి ఎంతెంత బాకీ పడిందో లెక్కలతో సహా ప్రజలకు వివరిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ చేసిన మోసాలకు బదులు తీర్చుకునే అవకాశం ప్రజలకు లోకల్ ఎన్నికల ద్వారా వచ్చిందని అభిప్రాయపడ్డారు.

ఇక నుంచి రాష్ట్రస్థాయి బీఆర్‌ఎస్ నాయకుల నుంచి గ్రామస్థాయి కార్యకర్తల వరకు కాంగ్రెస్ బాకీ కార్డులను  ఇంటింటికీ వెళ్లి పంచుతారని తెలిపారు. మోసపోతే గోస పడతామని ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పదే పదే చెప్పారని, ఇప్పుడదే నిజమైందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగే మొదటి కేబినేట్ సమావేశంలోనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు చట్టబద్ధత కల్పిస్తామని నాడు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ మాట ఇచ్చారని, ఇప్పటివరకు 30కి పైగా కేబినెట్ సమావేశాలు జరిగినా ఆ ఊసే లేదని, అయినప్పటికీ రాహుల్‌గాంధీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం సిగ్గుచేటన్నారు.

పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేతగా భట్టివిక్రమార్క ఇచ్చిన హామీలపై బాండ్ పేపర్లు, ప్రామిసరీ నోట్లపై సంతకాలు పెడతామని కోతలు కోశారని, అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల అమలుగురించి ప్రశిస్తే మాట దాటవేస్తున్నారని మండిపడ్డారు. పొరపాటున కాంగ్రెస్‌కు మళ్లీ ప్రజలు ఓటేస్తే రైతుభరోసా కూడా నిలిపివేస్తారని హెచ్చరించారు. కాంగ్రెస్ అసమ ర్థ పాలన కారణంగా రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగులు, మహిళలు, వృద్ధులు.. ఇలా అన్ని వర్గాల ప్రజల పరిస్థితి దయనీయంగా మారిందని పేర్కొన్నారు.

‘కాంగ్రెస్ బాకీ కార్డు’లోని ప్రతి అక్షరం రేవంత్ సర్కార్ మోసానికి నిలువుటద్దమని అభివర్ణించారు. రైతుల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం వారిని అడుగడుగునా దగా చేసిందని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ఎకరానికి రూ.15,000 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, దీనిపై ఇప్పటివరకు స్పష్టత లేదని నిప్పులు చెరిగారు. రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్న హామీ వందశాతం అమలు కాలేదని విమర్శించారు.

సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి సర్కార్ తర్వాత చేతులెత్తేసిందన్నారు. కౌలు రైతులు, రైతు కూలీల కన్నీళ్లను తుడుస్తామని చెప్పిన కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడా ఆ హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. నిరుద్యోగులకు నెలకు రూ.4,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి, 22 నెలలుగా స్పందించడం లేదని మండిపడ్డారు.

కాంగ్రెస్ బాకీల చిట్టా.. చాంతాడంత

‘మహాలక్ష్మి పథకం పేరుతో ఆడబిడ్డలను ఇంత దారుణంగా మోసం చేసిన ప్రభుత్వం మరొకటి లేదు. ఒక్కో మహిళకు నెలకు రూ.2,500 ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అలా ప్రభుత్వం 22 నెలలకు రూ. 55,000 చొప్పున బాకీ పడింది. కాంగ్రెస్ నేతలు ఆడబిడ్డల వివాహాలకు తులం బంగా ం ఇస్తామని హామీ ఇచ్చారు. వారి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల మంది ఆడబిడ్డలు వివాహం చేసుకున్నారు.

వారందరికీ ప్రభుత్వం 8 లక్షల తులాల బంగారం బాకీ ఉంది. వృద్ధులకు నెలకు రూ.4,000 చొప్పు న పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. అది కూడా అమలు కాలేదు. అలా 22 నెలల నుంచి ప్రభుత్వం రూ.44,000 చొప్పున బాకీ పడింది. దివ్యాంగుల పింఛను రూ.6,000 ఇస్తామని హామీ ఇచ్చారు. 22 నెలలుగా వారి బాకీ కూడా అలాగే ఉంది’ అని కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఒక్కో హామీని వివరించారు.

రాష్ట్రప్రభుత్వం నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు బాకీ ఉందని, తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యమకారులకు 250 గజాల చొప్పున స్థలాల బాకీ ఉందని, విద్యార్థినులకు స్కూటీలు, యువతకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డులు, ఆటోవాలాలకు రూ.24,000.. ఇలా ఏవైపు చూసినా కాంగ్రెస్ బాకీలు స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు. ప్రజల తరఫున గొంతు విప్పుతున్న బీఆర్‌ఎస్ నేతలపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని మండిపడ్డారు.

తమపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎంత వేధించినా భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. న్యాయపరంగా పోరాడుతూనే, ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్ ప్రజల హక్కుల కోసం పోరాడుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ బాకీ కార్డులను తెలుగు, ఉర్దూ, ఇంగ్లిషు భాషల్లో ముద్రించామని, తెలంగాణవ్యాప్తంగా ప్రతి గడపకూ వాటిని చేరుస్తామని తెలిపారు.