calender_icon.png 28 September, 2025 | 2:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పండుగ పూట పస్తులేనా!

28-09-2025 01:16:01 AM

  1. నాలుగు నెలలుగా డీఎస్సీ-2008 కాంట్రాక్ట్ టీచర్లకు అందని వేతనాలు
  2. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన
  3. ఆర్థికశాఖ వద్ద పెండింగ్‌లో రీ ఎంగేజ్ ఫైలు

హైదరాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): “అందరూ పర్వదినాలకు కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్‌లు చేస్తుంటే.. మేమేమో జీతాల కోసం ఎదురుచూస్తు న్నాం. అవి ఎప్పుడొస్తాయోనని!. అప్పులతో జీవితం గడుపుతున్నాం.” అంటూ ఓ కాంట్రాక్ట్ టీచర్ తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఈ ఒక్క కాంట్రాక్ట్ ఉపాధ్యాయుడి ఆవేదన..బాధ మాత్రమే కాదు. 1,225 కుటుం బాల ఆర్థిక సమస్య.  

సుధీర్ఘ పోరాటం తర్వాత..

2008-డీఎస్సీలో నష్టపోయిన బీఈడీ అభ్యర్థులకు వారు చేసిన సుధీర్ఘ న్యాయం పోరాటం తర్వాత విద్యాశాఖ ఈ ఏడాది ఫిబ్రవరి 14న 1,225 మందికి పోస్టింగ్‌లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరందరినీ కాంట్రాక్ట్ విధానంలో పాఠశాల విద్యాశాఖలో సెకండరీ గ్రేడ్ టీచర్లు(ఎస్జీటీ)గా ఉద్యోగాలను ప్రభుత్వం కల్పించింది. నెలకు రూ. 31,040 వేతనం ఖరారు చేస్తూ విధుల్లోకి తీసుకున్నారు.

ఉద్యోగ ప్రారంభంలో 2024-25 గత విద్యాసంవత్సరంలో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలకు వారికి జీతాలు జమ చేశారు. కానీ ఈ నూతన 2025-26 విద్యాసంవత్సరంలో మాత్రం వీరికి ఇప్పటి వరకు జీతాలు ఇవ్వలేదు. పాఠశాలలు పునఃప్రారంభమైన ఈ ఏడాది జూన్ నుంచి వీరికి వేతనాలే అందకపోవడం గమనార్హం.  అసలు ఈ ఉద్యోగంలో ఎందుకు చేరామోనని పలువురు కాంట్రాక్ట్ టీచర్లు తమ గోడు  వెల్లబోసుకుంటున్నారు.  

కంటిన్యూషన్ చేయకపోవడంతోనే..

వీరిని ఏటా విద్యాసంవత్సరం లాస్ట్ వర్కింగ్ డే రోజు ఏప్రిల్ 24న ఉద్యోగం నుంచి తొలగించి, తిరిగి జూన్ 12 (బడులు పునఃప్రారంభం) నుంచి విధుల్లోకి తీసుకుంటున్నారు. సంవత్సరానికి వీరికి 11 నెలల వేతనాన్నే అందిస్తారు. మే నెల జీతం ఇవ్వరు. గత విద్యాసంవత్సరంలోనూ ఇదే తరహాలో ఆలస్యంగా వేతనాలు జమయ్యాయి. వీరి జీతాలకు రీఎంగేజ్ (కంటిన్యూషన్) ఆర్డర్ ఇంత వరకు ఇవ్వకపోవడంతో జీతాలు జమకావడంలేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆర్డర్ ఇవ్వకుండానే విధుల్లోకి..

 కంటిన్యూషన్ ఆర్డర్ ఇవ్వకుండానే వీరిని ఈ విద్యాసంవత్సరానికి గానూ జూన్ 12 నుంచి విధుల్లో తీసుకున్నారు. అది ఇస్తేగానీ వీరికి జీతాలు వచ్చే పరిస్థితి లేదు. సచివాలయం చుట్టూ ఎన్ని సార్లు తిరిగినా సమస్య మాత్రం పరిష్కారం కావడంలేదని కాంట్రాక్ట్ టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫైలు మాత్రం ఆర్థిక శాఖ వద్ద ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉంది. దీనికి క్లియరెన్స్ రాకపోవడంతో వీరికి జీతాలు జమకావడం లేదు. 

అప్పులతో జీవనం

మేము అప్పులతో జీవనం సాగిస్తు న్నాం. మా సమస్యను ప్రభుత్వ సలహాదా రు హర్కర వేణుగోపాల్ దృష్టికి తీసుకె ళ్లాం. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి, సీఎస్ తో మాట్లాడి  సోమవారం వరకు కంటిన్యూషన్ ఆర్డర్ ఇప్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆ ఆర్డర్ లేనిది జీతాలు రావు.  గతంలో ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటే సమయానికి జీతాలు అందేవి. ఇందులో చేరాక జీతాలు రానిపరిస్థితి. అసలు ఇటు ఎందుకొచ్చామోనని చాలా మంది బాధపడుతున్నారు.  చాలా కాలంగా మా ఫైల్ ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉంది. ప్రభుత్వం వెంటనే రీ ఎంగేజ్ ఉత్తర్వులు జారీ చేస్తూ, వేతనాలు విడుదల చేయాలి. 

 ఉమా మహేశ్వర్ రెడ్డి,

కాంట్రాక్ట్ టీచర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు