calender_icon.png 28 September, 2025 | 2:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తూనే ఉంటాయ్

28-09-2025 01:12:18 AM

  1. కొందరికి చెంప దెబ్బ కొట్టినట్టు గ్రూప్-1 నియామకాలు 
  2. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాం తి): ఉమ్మడి రాష్ట్రంలో సైతం 40 ఏళ్లపాటు ఇంత పెద్ద ఎత్తున పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఉద్యోగ నియామకాలు జరిగిన దాఖలాలు లేవని, తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 562 మందికి ఏకకాలంలో గ్రూప్-1 నియామక పత్రాలు అందజేయడం ఎంతో గర్వకారణముందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. 

ఇప్పటి వరకు 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, ఇంకా ఉద్యోగ నోటిఫికేషన్లు నిరంతరం వస్తూనే ఉంటాయని, కొందరికి చెంపదెబ్బ కొట్టినట్లుగా గ్రూప్-1 నియామకాలు పూర్తి చేశామన్నారు. శనివారం శిల్పకళావేదికలో గ్రూప్-1 నియామకపత్రాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. అనేక సవాళ్లు, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికినీ రాష్ట్రాన్ని అజేయంగా నిలబడటానికి తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు.

ప్రత్యేక రాష్ర్టం సాధన కోసం నిరుద్యోగ యువత ఉరికంబాలు ఎక్కారని, అగ్నికి ఆహుతి అయ్యారని, నాడు యువత చేసిన పోరాటం త్యాగాలను చూసి పార్లమెంట్‌లో బలం లేకున్నా సోనియాగాంధీ అన్ని పార్టీలను కలుపుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని గుర్తు చేశారు. ఆనాటి పాలకులు అనేక విధాలుగా అవహేళన చేస్తూ, రాష్ర్ట ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని, చేపట్టే నియామకాల యజ్ఞక్రతువును కొందరు రాక్షసుల్లాగా అడ్డుపడే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ రాష్ర్ట అభివృద్ధి లక్ష్యంగా ఓ సంకల్పంతో తాను, సీఎం రేవంత్ రెడ్డి, క్యాబినేటంతా ముందుకు సాగుతున్నామన్నారు.

రూ. 22,500 కోట్లతో లక్షలాది ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి పేదవారి కలలు నెరవేరుస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం రాష్ర్ట ప్రజలను ఆత్మగౌరవంతో నిలబెట్టడమేనని అన్నారు. యువత మేధాశక్తిని ఉపయోగించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని అన్నారు. ప్రపంచంతో పోటీపడే స్థాయికి యువతను, వారి మేధ శక్తిని తీసుకువెళ్తామన్నారు.