28-09-2025 01:33:27 AM
రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములుకండి
హైదరాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): ‘తెలంగాణ భవిష్యత్ నిర్మాతలు మీరు. నవ్విన వాడి ముందు జారిపడ్డట్టు చెయ్యకండి. బాధ్యతతో వ్యవహరించండి. మహారాష్ట్ర, గుజరాత్ మాడల్ కాదు. మనమంతా కలిసి దేశానికి తెలంగాణ మాడల్ చూపిద్దాం. ఇక నుంచి యంత్రాంగాన్ని నడిపించే ఆఫీసర్స్ మీరు. రాష్ట్ర పునర్నిర్మాణంలో మీరంతా భాగస్వాములు కావాలి’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
‘కొలువుల పండుగ’లో భాగంగా శనివారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో గ్రూప్-1 కొలువులు సాధించిన అభ్యర్థులకు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వాకిటి శ్రీహరితో కలిసి సీఎం నియా మక పత్రాలు అందజేశారు. ఈ సందర్భం గా సీఎం మాట్లాడుతూ.. మూడు లక్షల మందితో పోటీపడి 562 మంది యువ కిశోరాలు గ్రూప్ -1 విజేతలుగా నిలిచారని కొనియాడారు.
తమ ప్రభుత్వం సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో పాలన సాగిస్తున్నదని తెలిపారు. తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్‌ను నమ్మి బాధ్యతలు అప్పగిస్తే నమ్మకద్రోహం చేసిందని, చరిత్రలో బీఆర్‌ఎస్ పాలకులు నమ్మక ద్రోహులుగా నిలిచిపోతారని పేర్కొన్నారు.
కేవలం 19 నెలల్లో గ్రూప్-1 నియామకాలు పూర్తి చేయడం ఒక రికార్డు అని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ గడ్డకు ఓ చరిత్ర, పౌరుషం ఉన్నాయని, కాలం కలిసి వచ్చి ఎన్నికల్లో గెలిచి, గత పాలకులు తాము కారణజన్ములమని భావించారని, కానీ.. ప్రజలకు విశ్వాసఘాతకులుగా మారారని, అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో బుద్ధిచెప్పారని వ్యాఖ్యానించారు.
అర్హతలేని వారు టీజీపీఎస్సీ సభ్యులుగా...
బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో గ్రూప్- 1 పరీక్షలు నిర్వహించలేదంటే, ఆ ప్రభుత్వం ఎంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందో అర్థం చేసుకోవచ్చని సీఎం అభిప్రాయపడ్డారు. ఉమ్మడిపాలనలో 2011లో గ్రూప్-1 పరీక్షలు జరిగాయని, అప్పటి నుంచి మళ్లీ గ్రూప్ -1 పరీక్ష జరగలేదని గుర్తుచేశారు. తమకు తాము ఉద్యమ నేతలని చెప్పుకొన్న బీఆర్‌ఎస్ నేతలు ఎందుకు గ్రూప్-1 పరీక్షలు నిర్వహించలేదో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
టీజీపీఎస్సీ సభ్యులుగా అర్హతల లేని వారిని బీఆర్‌ఎస్ ప్రభుత్వం నియమించిందని, తద్వారా యాదయ్య, కృష్ణయ్య, శ్రీకాంతాచారి, ఇషాన్‌రెడ్డి త్యాగాలను అపహాస్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హతలేని వారు కమిషన్‌లో సభ్యులుగా కొనసాగినందువల్లే.. నాడు పరీక్షల ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో పప్పు బెల్లాల్లా లభ్యమయ్యాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముందుగా టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసిందని, యూపీఎస్సీ కంటే ఉన్నతంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో విశ్రాంత డీజీపీని చైర్మన్‌గా నియమించామని తెలిపారు.
కేసులు వేసినా, కుట్రలు చేసినా ఓపికతో ఉన్నాం...
టీజీపీఎస్సీ రాజకీయ పునరావాస కేంద్రం కాదని, తెలంగాణ పునర్నిర్మాణ కేంద్రమని సీఎం అభివర్ణించారు. నాటి పాలకులు ఒక్కో గ్రూప్-1 పోస్టును రూ.2 కోట్లు, రూ.3 కోట్లకు బేరం పెట్టారని ఆరోపించారు. గ్రూప్-1 విజేతలు గుండెపై చేయి పెట్టుకొని చెప్పాలని, వారితో కలిసి తాను కనీసం ఒక్క టీ అయినా తాగలేదని తెలిపారు. గ్రూప్-1కు మోకాలడ్డుతూ కేసులు వేసిన వారి వెనుక ఎవరున్నారో విజేతలు గమనించాలని సూచించారు.
ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, కేసులు వేసినా, తప్పుడు ప్రచారం చేసినా తాము ఓపికతో దిగమింగామని, అభ్యర్థుల భవిష్యత్తు కోసం ఆందోళన పడ్డామని తెలిపారు. కోచింగ్ సెంటర్ల కుట్రలను సైతం పసిగట్టాలని, రూపాయి రూపాయి కూడబెట్టుకొని కోచింగ్ సెంటర్లలో ఉండి కష్టపడుతుంటే కొందరు పనిగట్టుకుని నోటిఫికేషన్లను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల రూపాయలు ఫీజులు చెల్లించి మరీ కేసులు వేయిస్తున్నారని ఆరోపించారు.
దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5 శాతం ఉందని, భవిష్యత్తులో జీడీపీ వాటా 10 శాతమవ్వాలని ఆకాంక్షించారు. 2047లో దేశంతోనే కాదు.. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ ఉండాలని అభిలషించారు. గ్రూప్ -1 విజేతలు తల్లిదండ్రులను గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలని, వారిని బాగా చూసుకోవాలని సూచించారు.
‘తల్లిదండ్రుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే మీ జీతాల్లోంచి పది శాతం కట్ చేసి వారి ఖాతాల్లో చేస్తాం.. అవసరమైతే అందుకు కొత్త చట్టం తీసుకొస్తాం’ అని సున్నితంగా సీఎం హెచ్చరించారు. ఉద్యోగాలు వచ్చిన కొత్తలో ఉద్యోగులు గరం.. తర్వాత నరం.. ఇంకొంత కాలం తర్వాత బేషరం అవుతారనే నానుడి ఉందని, ఆ నానుడిని తిరగరాసే విధంగా గ్రూప్ విజేతలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.