calender_icon.png 13 December, 2025 | 8:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనం లేని గ్రామంలో ఎన్నికలు

13-12-2025 01:53:29 AM

  1. సింగరేణి ఓసీ విస్తరణలో వెంకటేష్ ఖని గ్రామాన్ని విడిచిన ప్రజలు
  2.   179 మంది ఓటర్లతో ఈసీ జాబితా
  3. ఆదివారం అక్కడ ఎన్నికలు 

భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 12 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండల పరిధిలోని వెంకటేశ్వర ఖని గ్రామం సింగరేణి విస్తరణలో మాయమైంది. ఆ ఊరి ప్రజలు మూడేళ్ల క్రితమే తలోదిక్కయ్యారు. ప్రస్తుతం ఆ గ్రామంలో ఓటర్లు, జనం లేరు. అయినా అక్కడ ఎన్నికలు వచ్చాయి. రెండో విడతలో ఆదివారం జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలు ఆ గ్రామంలో నిర్వహించనున్నారు. 183 మంది జనాభాతో వెంకటేశ్వరఖని గ్రామం ఉండేది.

ఆ గ్రామంలో 79 కుటుంబాలు, 179 మంది ఓటర్లు ఉన్నారు. అయితే మూ డేళ్ల క్రితం సింగరేణి విస్తరణలో ఆ గ్రా మం కనుమరుగయింది. గ్రామస్తులు తలా దిక్కు వెళ్లి జీవనం సాగిస్తున్నారు. ఆ గ్రామాన్ని అప్పట్లో సింగరేణి అధికారులే ఖాళీ చేయించారు. వారికి సింగరేణి యాజమాన్యం స్థలం కేటాయించినా ఇంటి నిర్మాణాలు జరగలేదు. ఆ గ్రామస్థులు తలో దిక్కు కావడం తో కొంతమంది అడ్రస్ మాత్రమే తెలుస్తోం ది. మిగిలిన వారు ఎక్కడ ఉన్నారో తేలీదరు. 

ఊరు మాయం.. 

ఓటరు జాబితా పదిలం 

అక్కడ ఊరే లేదు, కానీ ఓటర్ల జాబితా భద్రంగా ఉంది. మూడేళ్ల క్రితమే ఖాళీ అయిన గ్రామం సమాచారాన్ని అధికారులు ఖాళీ అయినట్లు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. కనీసం ఓటర్ల జాబితాలో చేర్పులు మార్పులు, సవరణలు సమయంలోను ఆ గ్రామం గురించి ఉన్నతాధికారులకు తెలపకపోవడం శోచనీయం. ఓటర్లు ఉన్నారా లేరా అనేది కూడా నాయకులు పట్టించుకోకపోవడం పంచాయతీని దక్కించుకునే అంశంపై ఉన్న దృష్టి గ్రామం లేని విషయంపై ఉంచకపోవడం గమనార్హం. దీంతో ఎన్నికల సంఘం ఆ గ్రామంలో 179 మంది ఓటర్లతో ఈసీ జాబితాను సిద్ధం చేసి, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికకు నామినేషన్లు స్వీకరించారు.

ఇప్పుడు ఆ ఊర్లో ఎన్నికలు 

చుంచుపల్లి మండలంతో పాటు పట్టణ ప్రాంతాల్లో అక్కడి జనాభా అద్దె నివాసాల్లో ఉంటున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే అధికారుల తప్పిదంతో వాళ్ల ఓట్లు కూడా భద్రంగా ఉన్నాయి. ఊరు లేదు ఓటర్లు లేరు నాయకులకు మాత్రం పదవులు కావాలి కాబట్టి సర్పంచ్, వార్డ్ మెంబర్లకు పోటీ చేసేందుకు ఓటర్ జాబితాలో వ్యక్తులను రప్పించుకొని నామినేషన్లు వేయించారు. సర్పంచి పదవికి ముగ్గురు, 4 వార్డులకు పది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓటర్లు ఎక్కడ ఉన్నారో తెలియదు, ప్రచారం ఎలా చేయాలో అర్థం కాదు. అయినా ఈ నెల 14వ తేదీన ఓటర్లను ఎవరు తీసుకొచ్చి వేయిస్తారో అంతు చిక్కని విషయం.