13-12-2025 01:55:23 AM
హైదరాబాద్, డిసెంబర్ 12 (విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికల కోసం జిల్లాల పర్యటన పేరిట ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే ప్రచారం చేసినా పోటీ చేసిన చోట కనీసం 44 శాతం సీట్లను కూడా కాంగ్రెస్ దాటకపోవడం ప్రభుత్వంపై పెరిగిన ప్రజావ్యతిరే కతకు నిలువెత్తు నిదర్శనమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తొలిదశ పంచాయతీ పోరులో అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా హోరాహోరీగా పోరాడి సర్పంచ్‌లుగా, వార్డు మెంబర్లుగా గెలిచిన బీఆర్‌ఎస్ మద్దతుదారులకు శుక్రవారం ఎక్స్ వేదికగా శుభా కాంక్షలు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ హత్యారాజకీయాలకు పాల్పడినా మొక్కవోని ధైర్యంతో అధికార పార్టీ అరాచకపర్వాన్ని ఎదుర్కొని నిలబడిన గులాబీ సైనికులందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియ జేశారు. పంచాయతీ ఎన్నికలు అధికార పార్టీకి కొంత అనుకూలంగా ఉంటాయని తొలుత ప్రచారం జరిగినప్పటికీ రేవంత్ పరిపాలనా వైఫల్యంపై ప్రజలు పూర్తిగా విసిగిపోయారని ఈ ఎన్నికల ఫలితాలతో రుజువైపోయిందని తెలిపారు.
రాష్ర్టంలో ఇక ప్రత్యామ్నాయం కేవలం బీఆర్‌ఎస్ మాత్రమేనని, బీజేపీకి స్థానం లేదని కూడా తొలిదశ పంచాయతీ ఫలితాలు కుండబద్దలు కొట్టి చెప్పాయని స్పష్టంచేశారు. వచ్చే మూడేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా పల్లెల్లో పైసా అభివృద్ధి పని జరగదని, గ్రామస్థులు నిర్ధారణకు రావడం వల్లే అధికార పార్టీకి ఇంతటి ప్రతికూల ఫలితాలు ఎదురయ్యాయని పేర్కొన్నారు. సగం స్థానాలు కూడా కాంగ్రెస్ గెలవకపోవడం, అనేకచోట్ల 10, 20 ఓట్ల తేడాతోనే బయటపడటం చూస్తే కాంగ్రెస్‌కు కౌంట్ డౌన్ పల్లెల నుంచే ప్రారంభమైనట్టు స్పష్టంగా అర్థమైపోతున్నదని ఎద్దేవాచేశారు.
రెండేళ్లు గడిచినా ఆరు గ్యారంటీల పేరిట చేసిన సీఎం రేవంత్ మోసం, పెన్షన్ల పెంపు పేరిట చేసిన ద్రోహం, మహాలక్ష్మి పేరిట చేసిన దగా, తులం బంగారం పేరిట చేసిన నయవంచనను గ్రామీణ ప్రజలు మరిచిపోలేదని ఈ ఫలితాలు తేల్చిచెప్పాయని స్పష్టంచేశారు. యూరియా బస్తాల కోసం నెలల తరబడి పడిన అగచాట్లను, బోనస్ పేరిట చేసిన బోగస్ హామీని, చివరికి పండించిన పంటను అమ్ముకోలేక పడ్డ కష్టాలను అన్నదాతలు గుర్తుపెట్టుకున్నారని ఈ ఫలితాలు రుజువుచేశాయని తెలిపారు.
పదేళ్లపాటు ప్రగతిపథంలో సాగిన పల్లెల్లో రెండేళ్లుగా పడకేసిన పాలన, గాడితప్పిన పారిశుద్ధ్యం, చివరికి ట్రాక్టర్లలో డిజిల్ పోయలేని దుస్థితి వంటి అంశాలన్నీ పల్లె ప్రజలను ఆలోచింపజేసినట్టు ఫలితాలు స్పష్టంచేస్తున్నాయని పేర్కొన్నారు. ఇది ఆరంభం మాత్రమే, పంచాయతీ ఎన్నికలతో మొదలైన కాంగ్రెస్ పతనం రానున్న రోజుల్లో పాతాళానికి పడిపోవడం ఖాయమని హెచ్చరించారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకూ వచ్చే ప్రతి ఎన్నికలో గులాబీ జెండా ఎగరడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు.