16-01-2026 11:26:33 AM
సుల్తానాబాద్ ఎస్‌ఐ చంద్రకుమార్
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పల్లెలు సాంప్రదాయాలకు పుట్టినిల్లని, ఐక్యతతో పాటు పోటీ తత్వం ప్రతి మనిషిలో ఉండాల్సిన ముఖ్య లక్షణాలని సుల్తానాబాద్ ఎస్‌ఐ చంద్రకుమార్ అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నారాయణపూర్ అంబేద్కర్ కాలనీ 9వ వార్డులో వార్డు సభ్యులు కల్లెపల్లి దేవేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల కార్యక్రమానికి. ఎస్ఐ చంద్రకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్ఐ చంద్రకుమార్ మాట్లాడుతూ తెలంగాణ పండుగలు ప్రకృతి, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని పేర్కొన్నారు. ముగ్గుల పోటీలు కేవలం పోటీ భావనకే కాకుండా సామాజిక ఐక్యతను చాటే కార్యక్రమాలని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల్లో మహిళలు, యువత భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు.సంక్రాంతి సందర్భంగా మహిళల కోసం ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల్లో మొత్తం 22 మంది మహిళలు పాల్గొనగా, ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని న్యాయనిర్ణేతలు ఎంపిక చేసి మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. యువతను ఉద్దేశించి మాట్లాడుతూ యువకులు సన్మార్గంలో నడవాలని, గంజాయి వంటి మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. యువత భవిష్యత్తును నాశనం చేసే అలవాట్లపై తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మండల రమేష్, వార్డు సభ్యులు శ్రీనివాస్, శ్రీకాంత్, ఎలిగేటి సదానందం, గాలిపల్లి రాజమల్లు, కల్లెపెల్లి మహేందర్, కల్లెపెల్లి దేవేందర్, పూసల కిషోర్, వడ్లూరి మహేష్, కల్లెపెల్లి సాయి, బొబ్బిడాల భరత్, మనోజ్, అరవింద్, వినోద్, ప్రతాప్, స్వామి నంబయ్య, రవి, వీరయ్య, అనిల్, దుర్గరాజు, రాములు తదితరులతో పాటు అంబేద్కర్ కాలనీ పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.